బడ్జెట్‌లో హల్వా ఎందుకు?
న్యూఢిల్లీ : పానకంలో పుడకలా... దేశం ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఈ స్వీటు గొడవవేంటీ అనుకుంటున్నారా? ఇదీ బడ్జెట్‌లో భాగమే! అవును, బడ్జెట్ పత్రాలు సిద్ధమయ్యాక పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో హల్వా హడావుడి మొదలవుతుంది. బడ్జెట్ రూపకల్పనలోని చివరి అంకం ఈ మిఠాయితోనే ఆరంభమౌతుంది. పత్రాలన్నీ సిద్ధమయ్యాక... ప్రింటింగ్‌కి పంపించే ముందు బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామ్యులైన అధికారులందరూ హల్వా వండుకుని తింటారు. మామూలుగా అయితే, మన సంప్రదాయం ప్రకారం ఏపనినైనా పూజ చేసి మొదలుపెడతాం. కానీ, బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌కు ముందు అలాంటివేవీ ఉండవు. హల్వా పంచుకుని తినడమే అసలైన పండగ.
ప్రింటింగ్ ఎక్కడ?
బడ్జెట్ రూపొందించడం ఎంత పకడ్బందీగా జరుగుతుందో... ఆ పత్రాల ముద్రణ కూడా అంతే రహస్యంగా జరుగుతుంది. నిజానికి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పత్రాలూ ప్రభుత్వ ముద్రణాలయాల్లో జరుగుతాయి. కానీ, బడ్జెట్ పత్రాలు మాత్రం అలా కాదు. పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రత్యేకమైన ముద్రణా యంత్రంలో మాత్రమే వీటిని ముద్రిస్తారు. మొదట్లో... అంటే, 1947 నుంచి 1950 వరకూ బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు.
1950 తరువాత ప్రింటింగ్‌ను మౌంట్‌రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కి మార్చాల్సి వచ్చింది. కారణం... ఆ ఏడాది బడ్జెట్ పత్రాల్లోని సమాచారం ముందుగానే లీక్ కావడం! తరువాత, 1980 నుంచి బడ్జెట్ పత్రాల ముద్రణ కోసం ప్రత్యేకమైన ప్రెస్‌ను నార్త్‌బ్లాక్‌లో ప్రారంభించారు. ఈ ‘బడ్జెట్ ప్రెస్’ హాలు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. పూర్తి ఎయిర్ కండిషన్డ్, మోడరన్ మెషీన్స్, జామర్లు, సీసీ కెమెరాలు... బయట నుంచి చిన్న చీమ కూడా లోపలికి రాని విధంగా దీన్ని నిర్మించారు.