నేడు షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ41 ప్రయోగం | PSLV C 41 experiment is today in shar | Sakshi

నేడు షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ41 ప్రయోగం

Apr 12 2018 3:08 AM | Updated on Apr 12 2018 3:08 AM

PSLV C 41 experiment is today in shar - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ దవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ41 ఉపగ్రహ వాహకనౌకను గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు ప్రయోగించనున్నారు. 32 గంటల కౌంట్‌డౌన్‌ ప్రక్రియలో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాకెట్‌కు నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. అనంతరం రాత్రికి రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు.

రాకెట్‌కు తుది విడత పరీక్షలు నిర్వహించి హీలియం, నైట్రోజన్‌ గ్యాస్‌ నింపే పనులను పూర్తిచేసి రాకెట్‌కు అవసరమైన అన్ని వ్యవస్థలను శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు. గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు 1,425 కిలోల బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి మోసుకెళ్లేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.

ఈ ప్రయోగ పనులను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ మంగళవారం రాత్రే షార్‌కు చేరుకుని కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించారు. బుధవారం ఉదయం స్థానిక చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని మొక్కుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్‌కు పూర్తిగా సొంత నావిగేషన్‌ సిస్టం అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement