న్యూఢిల్లీ: జేఎన్యూ లో ఫిబ్రవరి 9 నాటి వివాదాస్పద కార్యక్రమంపై విచారణ కోసం నియమించిన అత్యున్నత స్థాయి కమిటీ మంగళవారం బహిరంగ విచారణ జరపనుంది. వర్సిటీ పాలక భవనం వద్ద దీన్ని నిర్వహించనుంది. అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహించడం గమనార్హం. కమిటీ మూడు అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తుందని జేఎన్యూటీఏ ప్రధాన కార్యదర్శి విక్రమాదిత్య చౌద్రీ చెప్పారు. దీనిపై అభిప్రాయాలు చెప్పేందుకు వర్సిటీ యంత్రాంగానికి కూడా ఆహ్వానం పంపారు.
మరోవైపు, మనుస్మృతికి సంబంధించిన పత్రాలను ఎందుకు తగలబెట్టారో వివరణ ఇవ్వాలని జేఎన్యూకు చెందిన ఐదుగురు ఏబీవీపీ మాజీ విద్యార్థులకు వర్సిటీ నోటీసులివ్వగా, తగలబెట్టడంలో తప్పేం ఉందని వారు ఎదురు ప్రశ్నించారు. దేనిపైనైనా నిరసన వ్యక్తం చేయడం తమ హక్కు అని పేర్కొన్నారు. కాగా, వర్సిటీ అధికారులు.. తాజాగా అడ్మినిస్రేటివ్ భవనంపై జై భీమ్ అని రాసినందుకు జితేంద్ర కుమార్ అనే విద్యార్థికి నోటీసు జారీచేశారు.