‘రెండో స్వచ్ఛత’కు ప్రజల మద్దతు
గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌లో మోదీ
ముంబై: నల్ల ధనానికి వ్యతిరేకంగా తాను ప్రారంభించిన ‘రెండో స్వచ్ఛత కార్యక్రమా’నికి (నోట్ల రద్దు) ప్రజల మద్దతు ఉందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో శత్రు స్థావరాలను శుభ్రం చేసే చర్యలైనా, దేశంలోని నల్లధనాన్ని శుభ్రం చేసే చర్యలైనా, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని చెప్పారు. ముంబైలో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌కు పంపిన వీడియో సందేశంలో ఆయన పై మాటలన్నారు. స్వచ్ఛభారత్ విజయవంతమైందని చెప్పారు. దేశంలో నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితిని నోబెల్ గ్రహీత బాబ్‌డిలన్ పాట ద్వారా మోదీ పరోక్షంగా ప్రస్తావించారు.
డిలన్ 1960లో మార్పు అంశంపై ‘ద టైమ్స్ దె ఆర్ ఎ-చేంజింగ్’ అనే పాటను రాసి, పాడారు. ఆ పాటలోని వాక్యాలను మోదీ ఉటంకించారు. ‘2014లో న్యూయార్క్‌లో నేను గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌కు హాజరై ఆస్వాదించాను. ఈ సారి ముంబైలో జరుగుతున్నా రాలేకపోతున్నాను’ అని మోదీ చెప్పారు. కాలం మారుతున్నప్పుడు మనం కూడా పాత దారిని వదిలేయడం మంచిదన్నారు. తాను అభిమానించే కళాకారులు వేరే ఉన్నారనీ, బాబ్ డిలన్, నోరా జోన్‌స, క్రిస్ మార్టిన్, ఏఆర్ రెహ్మాన్ లాంటివారు ప్రస్తుత తరానికి బాగా పరిచయం ఉన్నవారన్నారు. నటులు అమితాబ్, షారుక్ ఖాన్, కత్రినా కై ఫ్, ఏఆర్ రెహ్మాన్ ఈ కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చారు.