
రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు స్టే
హర్యానా ప్రభుత్వం జాట్ సిక్కులు, జాట్ ముస్లింలు, బిష్ణోయ్స్, రోర్స్, త్యాగీ కులాలను బీసీలలో చేరుస్తూ ప్రత్యేకంగా తయారుచేసిన 'సీ' కేటగిరీ రిజర్వేషన్లపై పంజాబ్-హర్యానాల హైకోర్టు స్టే విధించింది.
హర్యానా ప్రభుత్వం జాట్ సిక్కులు, జాట్ ముస్లింలు, బిష్ణోయ్స్, రోర్స్, త్యాగీ కులాలను బీసీలలో చేరుస్తూ ప్రత్యేకంగా తయారుచేసిన 'సీ' కేటగిరీ రిజర్వేషన్లపై పంజాబ్-హర్యానా హైకోర్టు స్టే విధించింది. మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం జాట్‌ల కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ భివానీకి చెందిన మురారీలాల్ గుప్తా అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత మార్చి 29న హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిన ఈ బిల్లును జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ తయారుచేసిందని, ఈ రిపోర్టును సుప్రీంకోర్టు కొట్టేసిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. ఒకసారి న్యాయవ్యవస్థ ద్వారా ఇచ్చిన తీర్పును తిరిగి మళ్లీ దాని ద్వారానే మార్చాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. 2014లో ప్రభుత్వం జాట్‌లను ఓబీసీల్లోకి చేర్చే ప్రయత్నం చేసిందని.. సుప్రీం కోర్టు కమిషన్ రిపోర్టులను కొట్టివేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు గుప్తా గుర్తుచేశారు. వాదోపవాదనలు విన్న జస్టిస్ మహేశ్ గ్రోవర్ తో కూడిన ధర్మాసనం అసెంబ్లీ బిల్లుపై స్టే విధిస్తూ.. తీర్పును వాయిదా వేసింది.