ఆ గ్రామస్తులకు సీఎం భరోసా..
పాకిస్థాన్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ భరోసా ఇచ్చారు. భారత ఆర్మీ ఇటీవల చేపట్టిన నిర్దేశిత దాడులపై ప్రజలు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న అనుమానంతో సరిహద్దు గ్రామాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్న నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించేందుకు అనుమతిస్తామన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పఠాన్ కోట్ జిల్లాల్లోని సహాయక శిబిరాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంలో నిర్వహించిన సమావేశంలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. రైతులు తమ పంటను పిల్లలకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారన్నారు. సరిహద్దు ప్రాంత రైతులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సహాయంతో పంటలను కోసి ఇంటికి తెచ్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లకోసం కేంద్ర ప్రభుత్వంతోపాటు, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అనుమతి కోరినట్లు బాదల్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో నివసించే రైతులంతా నిజమైన దేశ భక్తులుగా బాదల్ అభివర్ణిచారు. శత్రుభయంతో రోజువారీ తలపడే సరిహద్దు ప్రాంతాల్లోని రైతులంతా మాతృభూమికి నిజమైన సేవకులన్నారు.
ఇండో పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, సరిహద్దు గ్రామాలను వదిలి వెడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎప్పటికప్పుడు తగిన సహాయాన్ని అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు గ్రామాలను ఖాళీచేయించడంతోపాటు, సహాయక శిబిరాల్లో ఏర్పాట్లపై క్రమం తప్పకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపడతారని చెప్పారు. సహాయక శిబిరాల ఏర్పాట్లపై పోలీసు, మరియు జిల్లా యంత్రాంగాలను ప్రశంసించిన బాదల్.. ఈ పరిస్థితుల్లో ప్రతి అధికారీ ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. బార్త్ సాహిబ్, బమియాల్ శిబిరాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి ప్రజల సంరక్షణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.