ఇంఫాల్: కొంతకాలంగా హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల పర్యటన శనివారం మొదలైంది. ఇందుకోసం కాంగ్రెస్‌తో పాటు పలు పారీ్టలకు చెందిన 21 మంది ఎంపీల బృందం శనివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరితో పాటు కనిమొళి (డీఎంకే), సుష్మితా దేవ్ (తృణమూల్ కాంగ్రెస్), ఆర్జేడీ, ఆరెల్డీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, ఆరెస్పీ తదితర పారీ్టల ఎంపీలు వీరిలో ఉన్నారు. రాజకీయాలు చేసేందుకు రాలేదని అధీర్ స్పష్టం చేశారు.
‘‘కేవలం బాధితులను కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడమే మా ఉద్దేశం. సమస్యకు పరిష్కారానికి అన్ని పారీ్టలూ చిత్తశుద్ధితో కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. మణిపూర్ కల్లోలం దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందన్నారు. శనివారం తొలి రోజు ఇంఫాల్‌తో పాటు మొయ్‌రంగ్, విష్ణుపూర్ జిల్లాలతో పాటు తాజాగా హింసాకాండ చెలరేగిన చౌరాచంద్‌పూర్‌లో కూడా ఎంపీల బృందం పర్యటించింది. కుకీ తెగకు చెందిన బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. వారికి ధైర్యం చెబుతూ గడిపింది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేలా ఒత్తిడి తేవాలని బాధితులు వారిని కోరారు.
అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హింసాకాండ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అమలు చేస్తున్న కుట్ర ఫలితమేనని ఆరోపించారు. మణిపూర్ అంశంపై ప్రధాని, కేంద్ర మంత్రులు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అ«దీర్ దుయ్యబట్టారు. ‘‘మమ్నల్ని పార్లమెంటులో నోరెత్తనివ్వడం లేదు. అందుకే నేరుగా ప్రభావిత ప్రాంతాలకే వచ్చి, బాధితులతో మమేకమవుతున్నాం.
వారు అనుభవించిన చిత్రహింసలకు సంబంధించిన దారుణ గాథలను వారి నోటే విని చలించిపోయాం’’ అని చెప్పారు. భద్రతా కారణాల రీత్యా ఇంఫాల్ నుంచి హెలికాప్టర్‌లో బృందం పర్యటన సాగింది. ఆదివారం వారు గవర్నర్ అనసూయా ఉయికెను కలిసి సమస్యపై చర్చిస్తారని సమాచారం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఇరు తెగత వారితోనూ చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. శనివారం చౌరాచంద్‌పూర్‌లో పునరావాస శిబిరాన్ని ఆమె సందర్శించారు.
భారీ ర్యాలీ
విపక్ష ఎంపీలు మణిపూర్‌లో అడుగు పెట్టిన రోజే రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వేలాది మంది కుకీ తెగ ప్రజలు ఇంపాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. తమ ప్రాబల్యమున్న ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలన కావాలంటూ నినదించారు. మణిపూర్ సమగ్ర సమన్వయ కమిటీ సారథ్యంలో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది.
భర్త, కొడుకుల మృతదేహాలు చూపించండి
తన కుమారుడు, భర్త మృతదేహాలనైనా చూపించండంటూ అత్యాచార బాధితురాలు విపక్ష ఎంపీలను కోరారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ప్రత్యర్థి తెగకు చెందినవారు నగ్నంగా ఊరేగించడం తెలిసిందే. వారిలో ఒక మహిళను ఎంపీలు కనిమొళి (డీఎంకే), సుషి్మతాదేవ్ (టీఎంసీ) కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ Mýఆమె భర్తను, కొడుకును చంపడంతో పాటు ఆమె కూతురిపై కూడా అత్యాచారనికి ఒడిగట్టారన్నారు. ఈ కేసు విచారణను శనివారం సీబీఐ చేపట్టింది. మణిపూర్ హింసపై ఆరు కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఈ గొంతులు అప్పుడేమైనట్టు: బీజేపీ
మణిపూర్‌లో విపక్ష ఎంపీల పర్యటన ఫక్తు రాజకీయ నాటకమని బీజేపీ దుయ్యబట్టింది. గత ప్రభుత్వాల హయాంలో మణిపూర్ భగ్గున మండి నెలల తరబడి స్తంభించినప్పుడు వీరంతా పార్లమెంటులో కనీసం నోరైనా ఎత్తలేదెందుకని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. బీజేపీ విమర్శలను ఇండియా బృందం తిప్పికొట్టింది. ‘‘ప్రధాని సారథ్యంలో అఖిలపక్ష బృందం మణిపూర్‌లో పర్యటిస్తే అందులో ఆనందంగా భాగస్వాములం అయ్యేవాళ్లం. కానీ అందరికంటే ముందుగా, ఎక్కువగా స్పందించాల్సిన ఆయన అసలు సోదిలో కూడా లేకుండాపోయారు’అంటూ దుయ్యబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment