మార్పు దిశగా పంజాబ్‌! | Punjab in the direction of change! | Sakshi
Sakshi News home page

మార్పు దిశగా పంజాబ్‌!

Published Sat, Jan 28 2017 3:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మార్పు దిశగా పంజాబ్‌! - Sakshi

మార్పు దిశగా పంజాబ్‌!

పంజాబ్‌ నుంచి కె.ఆర్‌.మూర్తి
పంజాబ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అనడంలో సందేహం లేదు. ప్రస్తుత అకాలీదళ్‌–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం స్థానంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం ఇంకా సందిగ్ధమే. 1.92 కోట్లమంది ప్రజలు ఫిబ్రవరి 4న ఎవరికి ఓటు వేసి పట్టం కడతారనే ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్‌కూ, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కీ అనుకూలంగా దాదాపు సమానంగా వచ్చింది. ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ను గద్దె దింపాలనే విషయంలో మాత్రం చండీగఢ్, జలంధర్, అమృత్‌సర్, లుధియానా, పటియాలా పర్యంతం ఏకాభిప్రాయమే. ‘బదలావ్‌ జరూర్‌ చాహియే’ అన్నది అందరినోటా వినిపిస్తున్న మాట. నదీ పరీవాహక ప్రాంతాల ఆధారంగా పంజాబ్‌ను మూడు విభాగాలుగా పరిగణిస్తున్నారు.

రాబీ, బ్యాస్‌ నదుల మధ్య ప్రాంతాన్ని మఝా అనీ, సత్లుజ్‌కి దక్షిణ భాగాన్ని మాల్వా అనీ, సుత్లెజ్, బ్యాస్‌ నదుల మధ్య ప్రాంతాన్ని దొయాబీ అనీ పిలుస్తారు. అమృత్‌సర్, గురుదాస్‌పూర్, పఠాన్ కోట్‌ పట్టణాలు మఝాలో ఉన్నాయి. ఫరీద్‌కోట్, లుధియానా, పటియాలాలు మాల్వాలోనివి. జలంధర్, కపుర్తలా, హోషియార్‌పూర్‌లు దొయాబా ప్రాంతంలో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల చరిత్ర, సంస్కృతీసంప్రదాయాలు వేరు. అసెంబ్లీలోని మొత్తం 117 స్థానాలలో మఝాలో 25, దొయాబాలో 23, మాల్వాలో 69 ఉన్నాయి. అన్ని ప్రాంతాలలోనూ అకాలీ, కాంగ్రెస్‌ల ప్రాబల్యం ఉంది. బీజేపీకి మాత్రం పట్టణాలలోనే పట్టు ఎక్కువ.

‘అందరూ దొంగలే..’
‘సబ్‌ చోర్‌ హై. హమ్‌ బదలావ్‌ లాయింగే’ అన్నాడు ఫగ్వాడాలో మెకానిక్‌ షెడ్‌ యజ మాని హర్మిందర్‌సింగ్‌.పెద్దనోట్ల రద్దుపై ఆగ్రహం వెలిబుచ్చాడు. ‘మా దగ్గర పని చేసేవారికి రోజువారీ వేతనం ఇవ్వలేకపోయాం. మా ఆదాయం సగానికి పైగా పడిపోయింది. మోదీ ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఏమీ జరగడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది. అవినీతి అట్లాగే ఉంది. మోదీ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నాడు ’ అన్నాడు. పాలక పక్షంపై వ్యతిరేకత ఉందని, అయితే కాంగ్రెస్‌పై సద్భావమూ లేదని పేర్కొన్నాడు. ఈసారి ఎవరికి ఓటు వేస్తావంటే ఆప్‌కే అని నిస్సంకోచంగా బదులిచ్చాడు. ఫగ్వాడా దొయబా ప్రాంతంలోని జిల్లా కేంద్రం.

కెప్టెన్ పై నమ్మకం.. అమృత్‌సర్‌లో ‘సాక్షి’ బృందం ప్రశ్నించినవారిలో అత్యధికులు కాంగ్రెస్‌ నేత కెప్టెన్  అమరీందర్‌ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. బాదల్‌ పాలనలో ఒక కుంటుంబం మాత్రమే బాగుపడిందని చెబుతూనే ‘ఫిర్‌భీ థోడా బదలావ్‌ హోనీచాహియే’ అని ముక్తాయించారు. మాల్వాలో ఆప్‌ ప్రభావం ఎక్కువ. అక్కడి నుంచే 2014లో ఆప్‌ నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ పార్టీ హవా ఇప్పుడు కొంచెం తగ్గింది. నలుగురు ఎంపీలలో ఇద్దరిని పార్టీ సస్పెండ్‌ చేసింది. మూడో ఎంపీ అనారోగ్యం వల్ల క్రియాశీలంగా లేరు. ఆప్‌ తరఫున సంగ్రూర్‌ ఎంపీ భగవంత్‌మన్  ఒక్కడే చురుగ్గా ప్రచారం చేస్తున్నాడు.

డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పైన జలాలాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న ఆయనే ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశముంది. ఆప్‌ నాయకత్వ స్థాయిలో అనిశ్చితి ఉన్నప్పటికీ ఆ పార్టీపై సాధారణ ప్రజానీకంలో, ముఖ్యంగా అవినీతిరహిత సమాజం కోరుకునేవారిలో విశ్వాసం  ఉంది. సీ ఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ మాల్వాలోని లం బీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. అమరీందర్‌ లంబీతోపాటు తన సంస్థానం పటియాలా నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నారు.

చీలిపోనున్న దళితుల ఓట్లు..
పంజాబ్‌లో దళితుల సంఖ్య అధికం. జనాభాలో దాదాపు 32 శాతం. యూపీ తర్వాత పంజాబ్‌ని స్థావరంగా చేసుకోవడానికి బీఎస్పీ నేత మాయావతి యత్నాలు ఫలించలేదు. యూపీలోలా ఇక్కడ దళితుల్లో అభద్రతాభావన లేదు. 2015 నుంచి మాయావతి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఎన్ని అభియాన్ లు నిర్వహించినా ఫలితం లేకపోయింది. దళితులు కాంగ్రెస్‌కూ, అకాలీదళ్‌కూ మార్చి మార్చి ఓటు చేయడం రివాజు. 2014లో  మాల్వాలో ఎక్కువ మంది దళితులు ఆప్‌కు వేశారు. ఈ సారీ దళిత ఓట్లు మూడు పార్టీల మధ్యా చీలిపోయే వీలుంది. కాంగ్రెస్‌కు ఎక్కువ శాతం దక్కొచ్చని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా చెప్పారు. ఎస్సీలకు రిజర్వు అయిన 34 స్థానాల్లో సగం స్థానాలకు పైగా ఏ పార్టీ సంపాదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక బండ లెక్క.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement