‘స్వచ్ఛ' విద్యుత్! | pure electricity | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ' విద్యుత్!

Published Sun, Mar 1 2015 2:53 AM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM

‘స్వచ్ఛ' విద్యుత్! - Sakshi

‘స్వచ్ఛ' విద్యుత్!

దేశంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టాలని.. 2022 నాటికి 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న పలు ప్రాంతాల్లో ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను రూ. లక్ష కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు.

కానీ ఈ ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామనే అంశాన్ని పేర్కొనలేదు. విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టులను చేపట్టే (ప్లగ్ అండ్ ప్లే) విధానాన్ని అనుసరిస్తామని జైట్లీ వెల్లడించారు. బొగ్గు గనులకు సంబంధించి కూడా అన్ని రకాల అనుమతులు వచ్చిన అనంతరమే వేలం వేస్తామన్నారు.
 
భారీ లక్ష్యం: ఏడేళ్లలో 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. అందులో లక్ష మెగావాట్లను సౌర విద్యుత్ ద్వారా, 60 వేల మెగావాట్లు పవన, 10 వేల మెగావాట్లు జీవ వ్యర్థాల ద్వారా, 5 వేల మెగావాట్లను చిన్న జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
 
అణుశక్తికి రూ. 5,900 కోట్లు: దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనకు రూ. 5,900 కోట్లను కేటాయిస్తున్నట్లు జైట్లీ వెల్లడించారు. మొత్తంగా అణుశక్తి విభాగానికి రూ. 10,912 కోట్లను ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్, కల్పక్కం అణు పరిశోధన కేంద్రాలకు రూ. 1,912 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. కూడంకుళం రెండో యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశముందని..

దాంతో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ రంగంలోని సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి పేర్కొన్నారు. తమ ఇండస్ట్రీకి ఇది మంచి బడ్జెట్ అని వెల్‌స్పన్ రెన్యూవబుల్స్ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ చెప్పారు.
 
 ప్రస్తుత బడ్జెట్‌లో విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లను కేటాయించారు. అదే 2013-14లో రూ. 57,949 కోట్లు, 2014-15లో సవరించిన అంచనా ప్రకారం 55,488 కోట్లు వ్యయం చేశారు.
 
పునరుత్పాదక విద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా.. సౌర విద్యుత్ ఫలకాల తయారీలో వినియోగించే ‘ఎవాక్యుయేటెడ్ ట్యూబ్’లపై కస్టమ్స్ పన్నును మినహాయించారు. దీంతోపాటు పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థల్లోని ఇన్వర్టర్ల తయారీకి ఉపయోగించే ‘యాక్టివ్ ఎనర్జీ కంట్రోలర్ (ఏఈసీ)’లపై పన్నును 5 శాతానికి తగ్గించారు.
 
ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రకారం రూ. లక్ష కోట్లతో ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీ)ను ఏర్పాటు చేస్తారు.
 
 4,000 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను  యూఎంపీపీలుగా పేర్కొంటారు.
 ళీవిద్యుత్ కొరతతో సతమతమవుతున్న బిహార్‌లో వీటిల్లో ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికి జార్ఖండ్ లేదా ఒడిశాల నుంచి బొగ్గు సరఫరా చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే ఏపీలోని కృష్ణపట్నం, మధ్యప్రదేశ్‌లోని ససాన్, జార్ఖండ్‌లోని తలైయాలో, గుజరాత్‌లోని ముంద్రాలో యూఎంపీపీలను చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement