జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన | Puri Jagannath Temple Treasury Opened For Inspection | Sakshi
Sakshi News home page

జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన

Published Wed, Apr 4 2018 4:30 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

Puri Jagannath Temple Treasury Opened For Inspection - Sakshi

భువనేశ్వర్ ‌: ఒడిశాలోని  ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగారం తలుపులు ఎట‍్టకేలకు తెరుచుకున్నాయి. నగల భాండాగార నిర్మాణాన్ని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 34 ఏళ్ల తర్వాత బుధవారం  అధికారులు ఆలయ రత్న భాండాగార తలుపులు తెరిచారు. అయితే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని న్యాయస్థానం సూచనలు చేసింది. 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందం నగల భాండాగారం పరిశీలన చేపట్టింది.

కాగా చివరిసారిగా 1984వ సంవత్సరంలో రత్న భాండాగారం పరిశీలన నిర్వహించారు. ఇది అత్యంత గోప్య ప్రక్రియ. శ్రీ మందిరం సత్వ లిపి ప్రకారం ఈ ప్రక్రియ ఆద్యంతాలు నిర్వహిస్తారు. పరిశీలనలో భాగంగా రత్న భాండాగారం లోపలి గోడలు, పై–కప్పు ఇతరేతర నిర్మిత కట్టడాల స్థితిగతుల్ని నిపుణులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన పాలన అధికారి ప్రదీప్‌ కుమార్‌ జెనా తెలిపారు. రత్న భాండాగారం పరిశీలన వ్యవధిలో భక్తులకు దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారు. పరిశీలన ముగియడంతో బృందం సభ్యులు సమగ్ర నివేదిక తక్షణమే సమర్పించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

36 నియోగుల సమావేశం తీర్మానం మేరకు ఈ బృందంలో పూరీ గజపతి మహా రాజా ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు ప్రతినిధి, భండార్‌ మేకప్, పట్టజోషి మహాపాత్రో, దెవులొ కొరొణొ, తొడొవు కొరొణొ సేవాయత్‌ వర్గాల ప్రతినిధులతో భారతీయ పురావస్తు శాఖ ఇద్దరు ప్రతినిధులు, కోర్‌ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధుల్ని సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ మూడు అంచెల్లో తనిఖీలు నిర్వహించి రత్న భాండాగారం లోనికి అనుమతిస్తారు. తొలుత మజొణా మండపం ఆవరణలో తనిఖీ చేస్తారు. రెండోసారి బెహొరొణొ ద్వారం ముంగిట తనిఖీలు చేసిన తర్వాత రత్న భాండాగారం ప్రాంగణంలో భండార్‌ మేకప్‌ సేవాయత్‌ ప్రముఖులు తనిఖీ చేసిన మేరకు లోనికి ప్రవేశించేందుకు అనుమతిస్తారని వివరించారు. రత్న భాండాగారంలో గోప్యమైన విషయాలు, వివరాలు, అంశాల్ని బహిరంగంగా చర్చించడం వంటి చర్యలకు పాల్పడకుండా స్థానిక లోకనాథుని దేవస్థానంలో పరిశీలన బృందం సభ్యులు అంతా ప్రమాణం చేయడం అనివార్యంగా పేర్కొన్నారు.

గజపతి మహారాజా రావలిసిందే
జగన్నాథుని రత్న భాండాగారం పరిశీలన బృందంలో పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్‌ దేవ్‌ ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందేనని  జగన్నాథ సేవాయత్‌ సమ్మేళన్‌ స్పష్టం చేసింది. తరతరాల ఆలయ సంప్రదాయాల ప్రకారం పూరీ గజపతి మహా రాజా జగన్నాథుని తొలి సేవకుడు. జగన్నాథ ఆలయ అధికారిక మండలి శాశ్వత అధ్యక్షునిగా ఆయన కొనసాగుతున్నారు. ఆయన ప్రతినిధిని సభ్యునిగా రత్న భాండాగారం పరిశీలనకు ప్రేరేపించడం విచారకరం.

పూరీ గజపతి మహారాజా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్నాథ సేవాయత్‌ సమ్మేళన్‌  తెలిపింది. ఆలయ పాలక మండలి, సేవా యత్, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో నిర్వహించిన త్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఎటువంటి ప్రతిపాదన లేనట్లు సమ్మేళన్‌ ప్రముఖుడు కాశీనాథ్‌ ఖుంటియా తెలిపారు. ఈ సమావేశానికి హాజరు అయిన పూరీ గజపతి మహా రాజా దివ్య సింగ్‌ దేవ్‌ ఈ నేపథ్యంలో ఎటువంటి అభ్యంతరాల్ని ప్రస్తావించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు బదులుగా ప్రతినిధిని ఖరారు చేసి రత్న భాండాగారం పరిశీలన బృందం ఖరారు చేయడంపట్ల జగన్నాథ సేవా యత్‌ సమ్మేళన్‌ సందేహం వ్యక్తం చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement