గుర్మీత్ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల!
గుర్మీత్ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల!
Published Mon, Aug 28 2017 12:22 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
ముంబై: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎపిసోడ్‌పై మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా స్పందించారు. గుర్మీత్ దోషిగా తేలటం, హరియాణాలో హింస చెలరేగటం అంతా దైవ నిర్ణయమే అని ఆమె పేర్కొన్నారు.
వరుసగా బాబాలు, స్వామీజీలు జైలుకు వెళ్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన(గుర్మీత్) వ్యవహారం గురించి నాకేం తెలీదు. నేనే ఈశ్వర్య ధ్యానంలో మునిగిపోయి ఉన్నా. జరిగే పరిణామాలన్నీ ఆ భగవంతుడి లీలలే. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. అది వారి కర్మ’ అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న విమర్శల గురించి రాధే మా స్పందిస్తూ గాజుతో ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఎదుటి వాళ్ల మీద రాళ్లు వేయాలని ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు. ‘నేనొక రొమాంటిక్ దేవిని. నా ఇంటిని.. నా బిడ్డలను(భక్తులను) కాపాడుకోవటమే నా ముందున్న విధి.. విమర్శలను పట్టించుకోనూ’ అంటూ మరో వ్యాఖ్య కూడా రాధే మా చేశారు.
ఇక దేశ ప్రధాని మోదీ ఓ సాధువని, ఆయన నిర్ణయాలన్నీ దేశానికి మేలునే చేస్తాయని ఆమె చెప్పారు. మరోవైపు తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు రిషికపూర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి వారని, ఎలాంటి పాపం చేయలేదని, భగవంతుడే ఆయనకు సమాధానం చెప్తాడని రాధే మా అన్నారు.
తనకు తాను దైవంగా చెప్పుకునే రాధే మా 2015 లో ఓ మహిళను కట్నం కోసం వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. నటి డాలీ బింద్రా కూడా ఈ మాతాజీ పై బెదిరింపులు, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని భక్తి ముసుగులో అశ్లీలతను ప్రదర్శిస్తోందంటూ ఫాల్గుని బ్రహ్మభట్ట్ అనే న్యాయవాది ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు.
Advertisement