
తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధి సేవలను కొనియాడిన నేతలు..
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మృతి పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో ఆరు దశాబ్ధాల పాటు కరుణానిధి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన మృతితో భారత్ దిగ్గజ నేతను కోల్పోయిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, ప్రియతమ నేతను కోల్పోయిన లక్షలాది అభిమానులకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రాహుల్ ట్వీట్ చేశారు.
అమిత్ షా సంతాపం..
రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతిపై బీజేపీ చీఫ్ అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి చేసిన సేవలను ఎవరూ మరువలేరని కొనియాడారు. సినిమా రచయితగా మొదలైన ఆయన ప్రస్ధానం తమిళనాడుకు ఐదు సార్లు సీఎంగా సేవలందించే వరకూ సాగిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ విషాదాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు అమిత్ షా ట్వీట్ చేశారు.