
సోనియాకు రాహుల్ వారసుడవుతారా?
రాజకీయాల్లో జయాపజయాలు సహజమే అయినప్పటికీ పాలకపక్షం వేసే తప్పడడుగులను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవడం, చేసుకోకపోవడమేపైనే పార్టీల జయాపజయాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి.
న్యూఢిల్లీ: రాజకీయాల్లో జయాపజయాలు సహజమే అయినప్పటికీ పాలకపక్షం వేసే తప్పడడుగులను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవడం, చేసుకోకపోవడమేపైనే పార్టీల జయాపజయాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాలను ఏకం చేయడంలో విజయం సాధించడం వల్లనే నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది. ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ)ని ఏర్పాటు చేయడం వెనక సోనియా గాంధీ చేసిన కృషి ఎంతో ఉంది.
రాజకీయ పరిణతి అంతగా లేదని, వాజపేయి లాంటి ప్రత్యర్థుల ముందు తాను సరితూగరని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్ లాంటివారు, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలను కూడా సోనియా గాంధీ తప్పని నిరూపించారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా ఢీకొంటున్న వామపక్షాలను కూడా యూపీఏలోకి తీసుకరావడంలో ఆమె విజయం సాధించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యర్థులైన సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలను కూడా కూటమిలోకి లాక్కు రాగలిగారు. వాజపేయి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్న డీఎంకీ పార్టీని కూడా బయటకు రప్పించగలిగారు.
విదేశీ వనిత అంటూ సంఘ్ పరివార్ విస్తృత ప్రచారం చేసిన నేపథ్యంలో తనకు ప్రధాన మంత్రి పదవి వద్దనడం ద్వారా సోనియా గాంధీ తన ప్రతిష్టను మరింత పెంచుకోగలిగారు. 2004లోనే కాకుండా 2009లో కూడా యూపీఏ కూటమిని అధికారంలోకి తీసుకరాగలిగారు. తదనంతర పరిణామాల్లో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రాగలిగింది.
సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఓ తప్పడడుగు వేశారు. ఆయన చెప్పిన 50 రోజులు ముగిసినప్పటికీ ప్రజలకు నోట్ల కష్టాలు తీరులేదు. సమీప భవిష్యత్తులో తీరుతాయన్న సూచనలు లేవు. ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే సరైన అవకాశం. ప్రతిపక్షాలను ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు.
యూపీఏ ఏర్పాటుకు ప్రయత్నించినప్పుడు సోనియాపై ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పుడు రాహుల్‌పై కూడా రాజకీయ వర్గాల్లో అదే అభిప్రాయం ఉంది. రాజకీయ పరిణతి లేదని, మోదీ లాంటి వ్యక్తిని ఢీకొనగల తెలివితేటలు లేవన్నది ఆ అభిప్రాయం. పైగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఆఖరి రోజైన డిసెంబర్ 16వ తేదీన మోదీని కలసుకోవడం ద్వారా తప్పటడుగు వేశారు. ఫలితంగా వామపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా మంగళవారం మరోసారి ప్రతిపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్‌సీపీ, జేడీయూ లాంటి పార్టీలను లాక్కు రాలేకపోయారు.
అయినా ఇప్పటికీ మించి పోయినదేమీ లేదు. అన్ని పార్టీలను కలుపుకుపోయేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది. నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరేది కాదు. మోదీ మరిన్ని తప్పటడుగులు వేయరని కాదు. రాహుల్ గాంధీ తప్పటడుగులు వేయరాదు. అవసరమైతే ప్రధాని పదవికి దూరంగా ఉంటాననే త్యాగనిరతిని కూడా చాటాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ విజయం సాధిస్తారా, అంటే ఇప్పటికి సందేహాస్పదమే. కానీ ‘జరిగే ప్రతి సంఘటనకు దానికంటూ ఓ ప్రత్యేక కదలిక ఉంటుంది’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ సందర్భంలో అన్నారు. అలా సంఘటన వెనక సంఘటన జరుగుతూ వెళితే కదలికలు పెరిగి ప్రతిపక్షాలు సంఘటితం కావచ్చు. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్