
రాహుల్ గాంధీపై స్వామి ఫైర్
సైన్యం నిర్వహించిన మెరుపు దాడులపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుబ్రమణ్యస్వామి తప్పుబట్టారు.
న్యూఢిల్లీ: సైన్యం నిర్వహించిన మెరుపు దాడులపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి తప్పుబట్టారు. సైనికుల త్యాగాలతో పధాని నరేంద్ర మోదీ త్యాగాలు చేస్తున్నారన్న రాహుల్ గాంధీపై ఆయన విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి సరైన ఎడ్యుకేషన్ లేదని ధ్వజమెత్తారు. ప్రధానిపై మతిలేని వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ తన మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయించుకోవాలని సలహాచ్చారు.
సైనికులు ప్రాణాలకు తెగించి సర్జికల్ దాడులు నిర్వహించారని.. కానీ వారి త్యాగాలను రాజకీయాలకు వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ గురువారం వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన వివరణయిచ్చారు. సర్జికల్ దాడులను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పారు. ఆర్మీ చర్యలను రాజకీయాలకు వాడుకోవడాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు.