
లెఫ్టినెంట్ జనరల్ హుడా నేతృత్వంలో కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భద్రతపై కాంగ్రెస్ ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా (రిటైర్డ్) నేతృత్వం వహించనున్నారు. హుడా సారథ్యంలోనే 2016లో భారత సైన్యం మెరుపు దాడులను నిర్వహించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏర్పాటు చేసే ఈ టాస్క్‌ఫోర్స్ ఎంపిక చేసిన నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం భద్రతపై దార్శనిక పత్రాన్ని సమర్పిస్తుంది.
జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై పలువురు పోలీస్, సైనిక ఉన్నతాధికారులతో కలిసి లెఫ్టినెంట్ జనరల్ హుడా విస్తృత సంప్రదింపులు జరుపుతారు. నెలరోజుల వ్యవధిలో ఆయన జాతీయ భద్రతపై నివేదికను పార్టీకి సమర్పిస్తారు.