
అవే దేశానికి పెను సవాళ్లు
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు అసహనం, నిరుద్యోగమే అని,
నిరుద్యోగం, అసహనంపై రాహుల్
వాషింగ్టన్: ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు అసహనం, నిరుద్యోగమే అని, ఈ అంశాలు దేశ భద్రత, అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ మంగళవారం భారత, దక్షిణాసియా మేధావులతో సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్(సీఏపీ) సంస్థ నిర్వహించిన రౌండ్ టేబుల్‌తో పాటు వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. సదస్సులో సీఏపీ సంస్థ చీఫ్ నీరా టాండన్, భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ వర్మ, హిల్లరీ క్లింటన్ ప్రచార సలహాదారు జాన్ పోడెస్టా తదితరులు పాల్గొన్నారు.
వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలిలోని దక్షిణాసియా విభాగం అధిపతి లిసా కర్టిస్ రాహుల్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్–అమెరికా సంబంధాలు, ఇటీవల ట్రంప్ ప్రకటించిన అఫ్గాన్, దక్షిణాసియా విధానాల గురించి రాహుల్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, సీఈవో థాంప్సన్ జే డోనోహ్యూ రాహుల్‌తో భేటీ అయ్యారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు.