మోదీకి రాహుల్ ప్రశ్నాస్త్రాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 50 రోజులవుతున్న సందర్భంగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఒకరోజు ముందు ఈ ప్రశ్నలు వేశారు. నోట్ల రద్దుతో ఏం సాధించారని రాహుల్ ప్రధానిని ఎద్దేవా చేశారు. ‘నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని 50 రోజులైంది. మోదీజీ.. ఈ ఐదు ప్రశ్నలకు మీ సమాధానాల కోసం భారత్ ఎదురు చూస్తోంది. వీటికి బదులివ్వండి.
1. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేశాక నల్లధనం ఎంత బయటపడింది? 2. ఈ నిర్ణయం వల్ల భారత్ ఎంతమేరకు ఆర్థికంగా నష్టపోయింది.. దీంతోపాటు ప్రజల ఆదాయ వనరులు ఏ మేరకు దెబ్బతిన్నాయి? 3. నోట్ల రద్దు వల్ల ఎంతమంది చనిపోయారు.. వారికి ప్రభుత్వం పరిహారం ఇచ్చిందా.. ఇవ్వకపోతే ఎందుకివ్వలేదు? 4. నోట్ల రద్దు నిర్ణయానికి ముందు మీరు ఏ నిపుణులను సంప్రదించారు.. ఆర్థికవేత్తలు, నిపుణులు, ఆర్బీఐని ఎందుకు సంప్రదించలేదు? 5. నవంబర్ 8వ తేదీకి ముందు ఆరు నెలల్లో బ్యాంకుల్లో రూ. 25 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసినవారి వివరాలు చెప్పండి’అని రాహుల్ ప్రధాని మోదీని ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.