మోదీజీ.. ఈ ఐదు ప్రశ్నలకు జవాబు చెప్పండి
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న రాహుల్ తాజాగా ప్రధాని మోదీకి ఐదు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లను ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో వీటిని డిపాజిట్ చేసేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం సాధించారని మోదీని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ సంధించిన ప్రశ్నలివే..
- 1. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నల్లధనం ఎంత బయటపడింది?
- 2. భారత్ ఆర్థికంగా ఎంత వరకు నష్టపోయింది? ఎంత మంది ప్రజలు ఆదాయ వనరులను కోల్పోయారు?
- 3. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంతమంది మరణించారు? వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందా? చెల్లించకుంటే ఎందుకు ఇవ్వలేదు?
- 4. పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని సంప్రదించిన నిపుణులు ఎవరు?
- 5. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు రెండు నెలలలో బ్యాంకుల్లో 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారి వివరాలు చెప్పండి?