‘కశ్మీర్ నాశనానికి ఆయనే కారణం’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో దేశం (థర్డ్ పార్టీ) మధ్యవర్తిత్వం అవసరమని నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఇది దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో మూడో దేశం జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కశ్మీర్‌ను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా జమ్మూకశ్మీర్ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీని పరిష్కారానికి మూడో దేశం మధ్యవర్తిత్వం వహించాలని కొందరు సూచించే స్థాయికి సమస్య చేరింది. కానీ ఇది సరైంది కాదు. భారత్ అంటే కశ్మీర్.. కశ్మీర్ అంటే భారత్. ఇది మన అంతర్గత వ్యవహారం. ఇందులో మరో దేశం జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోమ’ని రాహుల్ గాంధీ అన్నారు.
కశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా, చైనా లాంటి దేశాల మధ్యవర్తిత్వం అవసరమని అంతకుముందు ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపమని ఫరూక్ అబ్దుల్లా సలహాయిస్తే సంతోషిస్తామని పీడీపీ ఎమ్మెల్యే సర్తాజ్ మాద్ని అన్నారు.