సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సునామీ వంటిదని, అది దేశ ఆర్థిక వ్యవస్థనూ చిన్నాభిన్నం చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రభుత్వం సరైన రీతిలో సన్నద్ధం కాకుంటే రాబోయే ఆరు నెలల్లో ప్రజలు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. భారత ఎకానీమీ అస్తవ్యస్తం కాబోతోందని..ఇది దేశానికి ఎంతటి పెను విపత్తో మీకు తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. సునామీ వచ్చే ముందు అండమాన్ నికోబార్ తీరంలో నీరంతా వెనక్కిమళ్లిందని..ఆ సమయంలో అందరూ చేపలు పట్టేందుకు వెళ్లగా నీరు మళ్లీ ముందుకొచ్చిందని రాహుల్ గుర్తుచేశారు.
అసలు ఏం జరుగబోతోందో వారికి (ప్రభుత్వానికి) తెలియడం లేదని, కరోనా వైరస్ సునామీ వంటిదని వ్యాఖ్యానించారు. భారత్ కేవలం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకే కాకుండా దాంతో పాటు వచ్చే ఆర్థిక విధ్వంసాన్ని కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో కొవిడ్-19 కేసులు ప్రబలుతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment