ఏపీకి వెంటనే ప్రకటించండి: ప్రధానికి రాహుల్ లేఖ
అరుణ్‌జైట్లీ ప్యాకేజీలో కొత్తదనం లేదు: దిగ్విజయ్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంపై ప్రధాని మోదీ మీద కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. విభజనతో ఆర్థికంగా దెబ్బతిన్న ఏపీకి గత యూపీఏ హయాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని హితవు పలికింది. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తూ బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు.
అరుణ్‌జైట్లీ ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం సూచించిందని జైట్లీ చెప్పడం సరికాదన్నారు. అలాంటి సూచనలను ఆర్థిక సంఘం చేయదని ట్వీట్ చేశారు. మరోవైపు విభజన కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు.