
సిద్దగంగమఠ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సాక్షి, బెంగళూరు/తుమకూరు: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. పోరాడాలనుకుంటే మైనారిటీలపై విద్వేషపూరిత దాడులు చేస్తున్న పాకిస్తాన్‌పై పోరాడాలని నిరసనకారులకు సూచించారు. కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో గురువారం ప్రధాని పాల్గొన్నారు. సిద్దగంగమఠ్‌లో గత సంవత్సరం చనిపోయిన శివకుమార స్వామీజీ సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు. ‘నినాదాలు ఇవ్వాలనుకుంటే పాక్‌లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా నినదించండి. ర్యాలీలు జరపాలనుకుంటే పాక్‌లో మతపరమైన వివక్షను ఎదుర్కొని భారత్‌కు వచ్చిన దళిత, అణగారిన వర్గాలకు అనుకూలంగా ర్యాలీలు జరపండి. ధర్నాలు చేయాలనుకుంటే.. గత 70 ఏళ్లుగా మైనారిటీలపై పాక్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ధర్నాలు చేయండి’ అని అన్నారు. మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్‌లో తొలి నుంచీ మైనారిటీలపై వివక్ష, వేధింపులు కొనసాగాయన్నారు.
‘పాక్‌లో హిందువులు, సిక్కులు, జైనులు.. అందరిపై మతపరమైన వేధింపులు జరిగాయి. వాటిపై కాంగ్రెస్ నోరు విప్పదు. కానీ, ఆ వేధింపులు తట్టుకోలేక అక్కడి నుంచి భారత్ వచ్చిన వారికి వ్యతిరేకంగా మాత్రం ధర్నాలు చేస్తోంది’ అన్నారు. అక్కడి నుంచి శరణార్ధులుగా వచ్చిన హిందువుల్లో అధికులు దళితులు, అణగారిన వర్గాలేనని, వారికి రక్షణ కల్పించాల్సిన సాంస్కృతిక, జాతీయ బాధ్యత భారతీయులందరిపై ఉందని పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు మద్దతిస్తున్న కాంగ్రెస్‌పై ఈ సందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు పాకిస్తాన్‌ను విమర్శించడానికి నోరు రాదు. అక్కడి మైనారిటీలపై పాక్ దుశ్చర్యలపై నోరు విప్పే ధైర్యం చేయరు. ఎందుకీ మౌనం?’ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బీజేపీపై ఉన్న ద్వేషం, ఇప్పుడు పార్లమెంట్‌పై ద్వేషంగా మారిందని విమర్శించారు. పొరుగు దేశాల నుంచి శరణార్ధులుగా వచ్చిన మైనారిటీలకు సాయం చేయడం మన సాంస్కృతిక, జాతీయ బాధ్యత అని వ్యాఖ్యానించారు.
6 కోట్ల మంది రైతులకు 12 వేల కోట్లు
‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ కింద 6 కోట్లమంది రైతులకు రూ. 12 వేల కోట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ పథకంలో పాలు పంచుకోని రాష్ట్రాలపై ఆయన విమర్శలు గుప్పించారు. చిల్లర రాజకీయాలు చేసి రైతులకు అన్యాయం చేయొద్దని వ్యాఖ్యానించారు. ఈ పథకంలో చేరని రాష్ట్రాలు.. ఈ కొత్త సంవత్సరంలోనైనా చేరాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ‘కృషి కర్మన్’ పురస్కారాలను ప్రధాని అందజేశారు.
లక్ష్యాల పరిధి పెంచుకోండి: రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లో జరిగిన ఒక కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొన్నారు. అక్కడ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. తమ సృజనాత్మక పరిధిని విస్తృతం చేసుకోవాలని సైంటిస్టులను కోరారు. ‘మీ సామర్ధ్యం అనంతం. మీరెన్నో చేయగలరు. పరిధిని విస్తృతం చేసుకోండి. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి’ అని వారిలో స్ఫూర్తి నింపారు. ఆధునిక సాంకేతికలను వృద్ధి చేసేందుకు డీఆర్‌డీఓ ప్రారంభించిన ‘డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్(డీవైఎస్‌ఎల్)’ను ప్రధాని జాతికి అంకితం చేశారు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ డీవైఎస్‌ఎల్‌లను ఏర్పాటు చేశారు.
అప్పుడు రాలేదేంటి?: ‘గతంలో రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు, రైతులు సాయం కోసం అలమటించినప్పుడు కర్ణాటకకు రాలేదేంటి?’ అని ప్రశ్నిస్తూ కర్ణాటక కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ప్రధానికి అమాయకులైన కర్ణాటక రైతులు గుర్తువచ్చారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment