పెరియార్ విగ్రహం
సాక్షి, చెన్నై : తమిళనాడు బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్ బుక్‌లో చేసిన ఓ పోస్టు కలకలాన్ని రేపింది. పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలంటూ ఆయన ఓ పోస్టు చేయటం.. అది రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.
త్రిపురలో గెలుపు తర్వాత బీజేపీ కార్యకర్తలు లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన రాజా తమిళనాడు సామాజిక వేత్త ఈవీఆర్ రామస్వామి(పెరియార్) విగ్రహాన్ని కూడా కూల్చేయాలంటూ పోస్టు చేశారు. ‘లెనిన్ ఎవరూ, ఇండియాతో ఆయనకు సంబంధం ఏంటి? కమ్యూనిస్ట్‌లకు మన దేశానికి అసలు సంబంధం ఏంటి? నిన్న లెనిన్ విగ్రహాన్ని తొలగించారు. రేపు పెరియార్ విగ్రహం పరిస్థితి కూడా అంతే’ అని ఆయన పోస్ట్ చేశారు.
అయితే ఆ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో దానిని తొలగించారు. ద్రవిడార్ కగజమ్ స్థాపన ద్వారా తమిళుల ఆత్మగౌరవం కోసం పోరాడిన పెరియార్‌ను అవమానించారంటూ పలువురు మండిపడుతున్నారు. రాజాను అరెస్ట్ చేయాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఎండీఎంకే, సీపీఎం, సీపీఐలు కూడా రాజాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్ ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించాడు.
రాజా పోస్ట్ చేసిన ఫేస్ బుక్ పోస్టు ఇదే
Comments
Please login to add a commentAdd a comment