చనుబాలను దానం చేసిన అమ్మలారా.. వందనం! | Rajasthan Govt to honour breast milk donors | Sakshi
Sakshi News home page

చనుబాలను దానం చేసిన అమ్మలారా.. వందనం!

Published Sat, Sep 30 2017 10:19 PM | Last Updated on Sun, Oct 1 2017 11:11 AM

Rajasthan Govt to honour breast milk donors

జైపూర్‌ : మరొకరికి పుట్టిన శిశువులకు సైతం తమ చనుబాలను అందిస్తూ అమ్మ పదానికి అసలైన అర్థం చెబుతోన్న మహిళలను రాజస్థాన్‌ ప్రభుత్వం సముచితంగా గౌరవించనుంది. రాష్ట్రంలోని 11 హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకు(తల్లిపాల బ్యాంకు)ల్లో పాలను దానం చేస్తోన్నవారి నుంచి 33 మందిని ఎంపిక చేసి, గాంధీ జయంతి(అక్టోబర్‌ 2న) జరగనున్న కార్యక్రమంలో సన్మానించనుంది. ఈ మేరకు రాజస్థాన్‌ ఆంచల్‌ మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ ప్రాజెక్టు సలహాదారు దేవేంద్ర అగర్వాల్‌ శనివారం ఒక ప్రకటన చేశారు.

ఏమిటీ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకు? : నవజాత శిశువులకు తల్లిపాల అవసరం ఎంతో అందరికీ తెలిసిందే. అయితే, కొందరు మహిళలకు పాలు పడని కారణంగా, వారికి పుట్టే పిల్లలు తల్లిపాలు లేక ఎదిగే క్రమంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ లోపాన్ని పూడ్చుతూ, జాతికి బలమైన పౌరులను అందించే దిశగా ఆయా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘మదర్‌ మిల్క్‌ బ్యాంకు’లను ఏర్పాటుచేశాయి. విదేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ తరహా విధానం భారత్‌లో కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 1989లో ముంబైలోని సియోన్‌ ఆస్పత్రిలో మొట్టమొదటి మదర్‌ మిల్క్‌ బ్యాంకును ఏర్పాటుచేశారు. ప్రముఖ యోగా గురు దేవేంద్ర అగర్వాల్‌ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థ రాజస్థాన్‌లో ప్రారంభించిన తల్లిపాల బ్యాంకు శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం 11 హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకులున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 17గా ఉన్నట్లు అంచనా!

పూర్తి ఉచితంగా :  రాజస్థాన్‌లో ఇప్పటివరకు 10,157 మంది తల్లులు.. 22లక్షల మిల్లీలీటర్ల పాలను ఇతరులకు దానం చేశారు. 7,513 మంది నవజాత శిశువులకు 56,191 యూనిట్ల (ఒక్కో యూనిట్‌= 30ఎం.ఎల్‌) పాలను పట్టించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని మదర్స్‌ మిల్క్‌ బ్యాంకుల్లో 6,605 యూనిట్ల తల్లిపాలను నిలువ ఉంచారు. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా, పూర్తి ఉచితంగా ఈ కార్యక్రమం కొనసాగుతుండటం విశేషం.

మూడు విభాగాల్లో అవార్డులు : అక్టోబర్‌ 2న జరిగే కార్యక్రమంలో మొత్తం మూడు విభాగాల్లో మహిళలకు అవార్డులు అందించనున్నారు. 1. వాత్సల్య అవార్డు(మొదటిసారి తల్లిపాలను దానం చేసిన వారికి), 2.ఆంచల్‌ కల్యాణి అవార్డు (ఎక్కువసార్లు పాలను దానం చేసిన తల్లులకు), 3.ఆంచల్‌ అమృత్‌ దా అవార్డు (ఎక్కువ మొత్తంలో పాలు దానం చేసిన తల్లులకు) విభాగాల్లో పురస్కారాలు అందిస్తారు.

రాజస్థాన్‌తో పోల్చితే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మదర్స్‌ మిల్క్‌ బ్యాంకుల ఏర్పాటుపై ప్రభుత్వాలు శ్రద్ధచూపడం లేదన్నది నిర్వివాదాంశం. పౌష్టికాహారలోపంతో 5ఏళ్ల లోపు పిల్లల మరణాలు అధికంగా ఉండే దేశాల జాబితాలో భారత్‌ ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్‌.. తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేపట్టినప్పట్టింది. కానీ మిల్క్‌ బ్యాంకుల ఏర్పాటు, విస్తృతిపై మాత్రం అవసరమైన మేర ప్రణాళికలు రూపొందించకపోవడం శోచనీయం.
(ఫొటో స్లైడ్‌ చూడండి..)

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement