జైపూర్: మహమ్మారి కరోనా(కోవిడ్-19) విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పొరుగు రాష్ట్రాలకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్నేహహస్తం అందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల ప్రజలకు రాజస్తాన్‌లో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రోజుకు ఐదు వేల మంది చొప్పున ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ఈ మేరకు వైద్య సదుపాయం అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. అదే విధంగా జూలై చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిలిండర్లకు బదులు పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే వెసలుబాటు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కోవిడ్-19 నియంత్రణ చర్యలపై ఆదివారం తన నివాసంలో సీఎం గెహ్లోత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.(ఢిల్లీ ప్రజలందరికీ కరోనా పరీక్షలు: అమిత్ షా)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో ఒక్క టెస్టింగ్ కిట్ కూడా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. అయితే ప్రస్తుతం రోజుకు 15 వేల మందికి చొప్పున వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదే విధంగా జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు మెరుగ్గా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల నిర్వహణతో పాటు రోగుల పట్ల అత్యంత బాధ్యతాయుతంగా మెలుగుతూ నిరంతరం వారిని పర్యవేక్షించడం వల్లే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. కాగా కరోనా టెస్టింగ్, రికవరీ రేటులో రాజస్తాన్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం నాటికి రాజస్తాన్‌లో 5,98,929 మందికి పరీక్షలు నిర్వహించామని... కరోనా పేషెంట్ల రికవరీ రేటు 75 శాతంగా ఉన్నట్లు వైద్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment