
సాక్షి,చెన్నై : కరోనావైరస్( కోవిడ్-19)ను కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ కట్టడి చేయడంపై ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీటర్ వేదికగా తమిళ ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించారు. ‘కరోనావైరస్ వ్యాప్తిని నివారించడానికి తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలను మనం అభినందించాలి. మనందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ.. కరోనావైరస్‌ను తరిమి కొట్టాలి’ అని రజనీకాంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కరోనావైరస్ వల్ల జీవనోపాధి దెబ్బతిన్న వారికి ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అందించాలని, అది వారికెంతో ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేశారు.
కాగా, తమిళనాడులో గురువారం నాటికి ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. 2635 మందిని గృహ నిర్భంధంలో ఉన్నారు. వీరుగాక మరో 24మంది ఆస్పత్రిల్లో ప్రత్యేక వైద్య నిఘాలో ఉన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లను బంద్ చేసింది. జైళ్లలో ఖైదీలను కలుసుకనే ములాఖత్‌లపై నిషేదం విధించింది. ప్రముఖ పర్యాటక క్షేత్రం మహాబలిపురంలో పర్యాటకుల రాకను నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment