కీలక నియామకాలు చేపట్టిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), ఎలక్షన్ కమిషనర్ పదవులకు కేంద్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. కాగ్ గా హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహర్షిని, ఎలక్షన్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను, సీబీఎస్‌ఈ బోర్డు ఛైర్మన్‌గా అనితా కార్వాల్‌ను నియమించింది.
హోంశాఖ కార్యదర్శిగా రెండేళ్లపాటు సేవలు అందించిన రాజీవ్ మెహర్షీ నేడు ఆ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయనకు కాగ్ గా సరికొత్త బాధ్యతలు అప్పగించారు. 1978 రాజస్థాన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మెహర్షీ 2015 ఆగస్ట్ 31 నుంచి హోంశాఖ కార్యదర్శిగా సేవలిందిస్తున్నారు. ఆయన గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా, రాజస్థాన్ సీఎస్‌గా విధులు నిర్వహించారు. సెప్టెంబర్ 24న కాగ్‌గా పదవీ విరమణ చేయనున్న శశికాంత్ శర్మ అనంతరం మెహర్షీ బాధ్యతలు స్వీకరిస్తారు.
1980 బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరా(61)ను ఎలక్షన్ కమిషనర్‌గా నియమించారు. ప్రసార భారతికి సలహాదారుడిగా, మినిస్ట్రి ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్‌కి కార్యదర్శిగా సేవలందించిన ఆరోరా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.