
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికపై స్పష్టత వచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ కారణాలతో 14 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు.
శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మృతితో ఏర్పడిన ఖాళీలకు కూడా ఈ సమయంలోనే ఉప ఎన్నికలను నిర్వహిస్తామని అరోరా ప్రకటించారు. అయితే ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రకటిస్తుందని తెలిపారు.