
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. పాక్‌లో పని చేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించడం.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటిని తెంచుకుంటున్నట్లు ప్రకటించడమే కాక నేడు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. పాక్ చర్యలపై కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి పొరుగువారు ఉండకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్ చర్యలపై రాజ్‌నాధ్ స్పందిస్తూ.. ‘మన పొరుగువారి వల్ల మనకు చాలా భయాలున్నాయి. మన స్నేహితుల్లో ఎవరైనా మనకు నచ్చకపోతే.. వారిని వదిలించుకోవచ్చు. అసలు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలో మనమే నిర్ణయించుకుంటాం. కానీ ఇరుగు పొరుగు విషయంలో ఇలాంటి అవకాశం ఉండదు. మన పొరుగు వారు ఎలాంటి వారైనా సరే చచ్చినట్లు భరించాల్సిన పరిస్థితి’ అంటూ రాజ్‌నాధ్ అసహనం వ్యక్తం చేశారు. ఎవరికి ఇలాంటి పొరుగువారు ఉండకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు రాజ్‌నాధ్ సింగ్.
జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతామని పాక్ తెలిపింది. అంతేకాక తమ గగనతలాన్ని సెప్టెంబర్ 5 వరకు పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో తాము చైనాతోనూ సంప్రదింపులు జరుపుతామని పాక్ పేర్కొన్నది.