
అనంత్‌కుమార్, మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న ‘కులహింస’ బుధవారం పార్లమెంటును కుదిపేసింది. ఉభయసభల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఆరెస్సెస్, హిందూత్వ సంస్థలు మహారాష్ట్రలో దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ విమర్శించింది. ఈ దాడులపై ప్రధాని మౌనం వహించటంపై మండిపడ్డ లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే.. మహారాష్ట్ర ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ, ఆరెస్సెస్ తిప్పికొట్టాయి.
వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న కాంగ్రెస్ అసహనంతోనే నోటికొచ్చిన విమర్శలు చేస్తోందని బీజేపీ విమర్శించింది. కాగా, భారత్‌లో కుల, మతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు ‘బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్’ ప్రయత్నిస్తోందని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఆరెస్సెస్ విమర్శించింది. 2016లో జేఎన్‌యూలో జాతివ్యతిరేక నినాదాలు చేసిన వారు, వారికి అండగా నిలిచిన వారు ఇప్పుడు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నారని ఆరెస్సెస్ ముఖ్యనేత మన్మోహన్ వైద్య ఆరోపించారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే మహారాష్ట్ర అల్లర్లపై విపక్షాలు ఆందోళన ప్రారంభించాయి. కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ శక్తులు మహారాష్ట్రలో దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ‘ఈ హింస వెనక ఆరెస్సెస్, ఇతర హిందూ శక్తులున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. దళితుల అంశాల్లో రాగానే ఆయన ‘మౌని బాబా’గా మారిపోతారు’ అని ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ సభ్యులు ఖండించారు. ‘భీమా–కోరేగావ్ వివాదాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఈ వివాదం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు’ అని పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. అనంతరం కీలకమైన ఓబీసీ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగటంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదావేశారు.
అట్టుడికిన రాజ్యసభ
రాజ్యసభ కార్యక్రమాలకూ ‘మహా’ హింస పలుమార్లు అవరోధం కల్గించింది. హింసపై చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్, బీఎస్పీ పట్టుబట్టడంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. బీజేపీ, ఆరెస్సెస్‌లు దళిత వ్యతిరేకులని ఆజాద్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఎస్పీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
‘తలాక్’పై రాజ్యసభలో..
న్యూఢిల్లీ: ‘తక్షణ ట్రిపుల్ తలాక్’ బిల్లుపై బుధవారం రాజ్యసభ అట్టుడికింది. లోక్‌సభ ఆమోదం పొందిన ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు – 2017పై రాజ్యసభలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. మహారాష్ట్ర వివాదంపై పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపాలని డిమాండ్ చేశాయి. సెలెక్ట్ కమిటీలో ఉండాల్సిన సభ్యుల పేర్లతో కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఓ జాబితాను డిప్యూటీ చైర్మన్ కు అందజేశారు.
ఈ బిల్లు తీసుకురావటం ద్వారా నేరాలు పెరిగేందుకు ప్రోత్సహించేలా ముస్లిం లను బీజేపీ మోసగిస్తోందని.. గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకే బీజేపీ బలప్రయోగం ద్వారా బిల్లులను ఆమోదింపజేసుకుంటోందన్నారు. విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. బిల్లుపై చర్చను తప్పించుకునేందుకే కాంగ్రెస్.. సెలెక్ట్ కమిటీ నాటకమాడుతోందని బీజేపీ విమర్శించింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కటంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను గురువారానికి వాయిదా వేశారు. శీతాకాల సమావేశాలకు రెండ్రోజులే మిగిలి ఉండటంతో ఈ బిల్లును నెగ్గించుకునేందుకు ప్రభుత్వం, వ్యతిరేకించేందుకు విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్న సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment