
పెద్దల సభలో వికసించనున్న కమలం!
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల నాటికి రాజ్యసభలో తమకు బలం పెరుగుతుందని, సభా వ్యవహారాలు సజావుగా సాగుతాయని బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసింది. సభ చైర్మన్ కూడా అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థే గెలుస్తారని ఆ పార్టీ ధీమాతో ఉంది. వచ్చే ఏడాది సభలో తమ బలం పెరిగి, బడ్జెట్ సమావేశాల నుంచి పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే రాజ్యసభ, లోక్‌సభల్లోని 790 మందికిగాను ప్రాంతీయ పార్టీల మద్దతుతో తమకు 550 మంది ఓట్లు వచ్చే అవకాశముందని తెలిపాయి.
వచ్చే ఏడాది అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసుకుని ప్రభుత్వం బిల్లులతో ముందుకెళ్తుందన్నాయి. విపక్షానికి మెజారిటీ ఉన్న రాజ్యసభలో ప్రభుత్వం తెచ్చే తీర్మానాలు గట్టెక్కడం లేదు. ఇప్పటి నుంచి 2018 ఏప్రిల్‌లోగా ఎగువ సభలో 72 మంది పదవీ కాలం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పార్టీకి పలువురు ఎంపీలు తోడై రాజ్యసభలో బలం పెరగనుంది.