డేరాలో ఏమున్నాయో తెలిస్తే ఔరా అనాల్సిందే...
సిర్సాః రాక్‌స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా ప్రధాన కార్యాలయంలో సకల భోగాలు అనుభవించాడు. కళ్లు చెదిరే భవంతులూ, చారిత్రక కట్టడాలను తన చెంతనే నిర్మించుకున్నాడు. డేరా ప్రాంగణంలోనే ఈఫిల్ టవర్, తాజ్ మహల్, డిస్నీలాండ్‌ల నమూనాలను సృష్టించాడు.సువిశాల 700 ఎకరాల ప్రాంగణంలో ప్రపంచంలోని ఏడు వింతలను ఆవిష్కరింపచేయాలని ప్లాన్ చేశాడు. అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ డేరాలో ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపాడో ఆ ప్రదేశాన్ని వీక్షిస్తే స్పష్టమవుతుంది.డేరా క్యాంపస్ అంతటా లగ్జరీ క్యాసిల్స్, రిసార్ట్స్, మొఘల్ కోర్ట్స్ కనిపిస్తాయి.భారీ ఓడ సైతం ప్రాంగణంలో నిలిపిఉంది.డేరా ముఖద్వారంలోనే గోడపై పలు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి.
ఇక గుర్మీత్ సింగ్ నటించే సినిమాలు షూటింగ్ జరిగే ఫిల్మ్ సిటీ కూడా డేరా ప్రాంగణంలో కొలువుదీరింది. ఫిల్మ్ సిటీలోపలకు అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించడానికి వీలులేకుండా ఎలక్ర్టిక్ వైర్లతో కంచె ఏర్పాటు చేశారు. మరోవైపు గుర్మీత్ గుట్టుమట్లను ఛేదించేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్జ్ సారథ్యంలో అధికారులు డేరా ప్రాంగణంలో తనిఖీలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో డేరా లోపల, వెలుపల భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ బృందం సోదాల అనంతరం బాబాకు సంబంధించి మరిన్ని రహస్యాలు బట్టబయలయ్యే అవకాశాలున్నాయి.