జైలులో చెమటోడుస్తున్న డేరా బాబా
Published Wed, Sep 20 2017 3:12 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
సాక్షి,చండీగర్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైలులో రోజుకు రూ 20 సంపాదిస్తున్నాడు.కూరగాయలు పెంచడం, చెట్లను ట్రిమ్ చేయడం వంటి పనుల్లో ఆయన నిమగ‍్నమయ్యాడు. సువిశాల డేరా ప్రాంగణంలో విలాస జీవితం గడిపిన గుర్మీత్ జైలులో రోజుకు ఎనిమిది గంటలు కష్టపడుతున్నాడు. అత్యాచార కేసుల్లో సీబీఐ కోర్టు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. ఇక రోహ్తక్ జైలులోని తన బ్యారక్ పక్కనే ఉన్న కొద్దిపాటి భూమిలో ఆయన కూరగాయలు పండిస్తున్నాడని, ఇప్పటికే తన పని మొదలుపెట్ఆటడని హర్యానా డీజీపీ కేపీ సింగ్ చెప్పారు.
ఆ భూమిలో పండించిన దిగుబడిని జైల్ మెస్‌లో ఉపయోగిస్తారని తెలిపారు. 1967, ఆగస్ట్ 15న రాజస్ధాన్‌లోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రామ్ రహీం బాల్యంలో తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరించేవాడు.జైలులో సైతం ఆయన ఇదే పని ఎంచుకున్నాడని, సాగు పనులు నైపుణ్యంలేని పనుల క్యాటగిరీలో ఉండటంతో ఆయనకు రోజుకు రూ 20 కూలి చెల్లిస్తారని డీజీపీ చెప్పారు. మరోవైపు గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేకంగా ట్రీట్ చేయడం లేదని, ఆయనను సాధారణ ఖైదీలాగానే జైలు అధికారులు పరిగణిస్తున్నారని అన్నారు. గుర్మీత్ బ్యారక్‌లో టీవీ లేదని, ఆయనను ఇతర సామాన్య ఖైదీలాగానే చూస్తున్నారని ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే ఆయనకూ ఇస్తున్నారని చెప్పారు.
Advertisement