Rohtak Jail
-
రూ. 20 సంపాదిస్తున్న డేరా బాబా
రోహ్తక్, హర్యానా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు రోహ్తక్ జైల్లో 0.2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో డేరా బాబా కూరగాయలు పండిస్తూ రోజుకు 20 రూపాయల వరకూ సంపాదిస్తున్నారు. జైల్లోకి వెళ్లిన నాటి నుంచి ఇప్పటివరకూ గుర్మీత్ ఒకటిన్నర క్వింటాళ్ల బంగాళదుంపలు పండించారు. అంతేకాకుండా తనకు కేటాయించిన స్థలంలో డేరా బాబా అలోవేరా, టమోటాలు, సొర కాయలు, బీర కాయలు కూడా పండిస్తున్నట్లు పేరు తెలుపడానికి ఇష్టపడని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. రోజుకు రెండు గంటల పాటు వ్యవసాయ క్షేత్రంలో డేరా బాబా శ్రమిస్తున్నారని వివరించారు. డేరా బాబా పండించిన కూరగాయలను జైలులో వంటకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కూరగాయల ద్వారా సంపాదించిన సొమ్ము గుర్మీత్ చేతికి అందడం లేదని చెప్పారు. జైలులో ఉన్న వారి శ్రమకు వచ్చే ధనాన్ని ఆన్లైన్ ద్వారా అకౌంట్లలో వేస్తారని తెలిపారు. హర్యానా హైకోర్టు గుర్మీత్ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ఆదేశించడంతో సంపాదించిన సొమ్ము సైతం డేరా బాబాకు అందడం లేదని చెప్పారు. జైలులోని వారికి అధ్యాత్మిక బోధనలు చేసేందుకు అనుమతించాలని కూడా డేరా బాబా ప్రభుత్వానికి వినతి పెట్టుకున్నారని వెల్లడించారు. అయితే, ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. కాగా, 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాను రోహ్తక్ జైల్లోని ప్రత్యేక బారాక్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే. జైలుకి వెళ్లిన నాటి నుంచి డేరా బాబా ఆరు కిలోల బరువు తగ్గారు. వ్యవసాయ క్షేత్రంలో చెమటోడ్చుతుండటంతో ఆయన ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. -
జైలులో డేరా బాబాకు రాజభోగాలు
చంఢీగఢ్ : ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ రోహ్తక్ సునారియా జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇటీవల జైలునుంచి విడుదలైన ఓ నిందితుడు రాహుల్ జైన్ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. తోటమాలిగా పనిచేస్తున్నందుకు డేరా బాబాకు రోజుకు రూ. 20 చొప్పున ఇస్తున్నామని పోలీసులు చెప్పినదాంట్లో వాస్తవం లేదన్నాడు. 'ముందుగా గుర్మీత్‌కు జైలులో ప్రత్యేక గది ఇచ్చారు. ఆ గది చుట్టుపక్కలకు కూడా ఇతర ఖైదీల్ని అనుమతించేవారు కాదు. ఆపై కావాలసినప్పుడల్లా పాలు, మినరల్ వాటర్, జ్యూస్‌లు అందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సాధారణ ఖైదీల బంధువులు, సన్నిహితులు జైలుకు వస్తే కేవలం 20 నిమిషాలు మాత్రమే ఖైదీల్ని కలిసేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ డేరా బాబా మాత్రం గంటల తరబడి తనను కలిసేందుకు వచ్చేవారితో ముచ్చటిస్తాడు. అతడు ఏ పని చేయడం లేదని, కానీ తోటమాలిగా చేస్తున్నందుకు రోజుకు 20రూపాయలు గుర్మీత్‌కు ఇస్తున్నట్లు అందర్ని నమ్మిస్తున్నారని' జైలులో ఉన్పప్పుడు గుర్మీత్ తోటి ఖైదీ అయిన రాహుల్ వివరించాడు. నిన్న (సోమవారం) గుర్మీత్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎందుకు కలిశారు, గుర్మీత్‌తో ఏం మాట్లాడారన్న దానిపై పోలీసులు, జైలు అధికారులు నోరు మెదపడం లేదని సమాచారం. -
జైలులో చెమటోడుస్తున్న డేరా బాబా
-
జైలులో చెమటోడుస్తున్న డేరా బాబా
సాక్షి,చండీగర్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైలులో రోజుకు రూ 20 సంపాదిస్తున్నాడు.కూరగాయలు పెంచడం, చెట్లను ట్రిమ్ చేయడం వంటి పనుల్లో ఆయన నిమగ్నమయ్యాడు. సువిశాల డేరా ప్రాంగణంలో విలాస జీవితం గడిపిన గుర్మీత్ జైలులో రోజుకు ఎనిమిది గంటలు కష్టపడుతున్నాడు. అత్యాచార కేసుల్లో సీబీఐ కోర్టు డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే. ఇక రోహ్తక్ జైలులోని తన బ్యారక్ పక్కనే ఉన్న కొద్దిపాటి భూమిలో ఆయన కూరగాయలు పండిస్తున్నాడని, ఇప్పటికే తన పని మొదలుపెట్ఆటడని హర్యానా డీజీపీ కేపీ సింగ్ చెప్పారు. ఆ భూమిలో పండించిన దిగుబడిని జైల్ మెస్‌లో ఉపయోగిస్తారని తెలిపారు. 1967, ఆగస్ట్ 15న రాజస్ధాన్‌లోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రామ్ రహీం బాల్యంలో తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరించేవాడు.జైలులో సైతం ఆయన ఇదే పని ఎంచుకున్నాడని, సాగు పనులు నైపుణ్యంలేని పనుల క్యాటగిరీలో ఉండటంతో ఆయనకు రోజుకు రూ 20 కూలి చెల్లిస్తారని డీజీపీ చెప్పారు. మరోవైపు గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేకంగా ట్రీట్ చేయడం లేదని, ఆయనను సాధారణ ఖైదీలాగానే జైలు అధికారులు పరిగణిస్తున్నారని అన్నారు. గుర్మీత్ బ్యారక్‌లో టీవీ లేదని, ఆయనను ఇతర సామాన్య ఖైదీలాగానే చూస్తున్నారని ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే ఆయనకూ ఇస్తున్నారని చెప్పారు. -
'గుర్మీత్‌ను ఖైదీలే చంపేలా ఉన్నారు'
హర్యానా: రోహతక్ జైలులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ప్రాణహానీ ఉందని సోమూ పండిట్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. అదే జైలులో ఇతడు సహచర ఖైదీగా ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా జైలులో గుర్మీత్ పరిస్థితి గురించి చెబుతూ ఆయనను ఒంటరిగా వదిలేస్తే సహచర ఖైదీలే ఆయనను హత్య చేసే అవకాశం ఉందని చెప్పాడు. రామ్ రహీమ్ సింగ్‌పై జైలులో చాలామంది ఖైదీలు ఆగ్రహంతో ఉన్నారని, వారు ఏ క్షణమైనా ఆయనపై దాడి చేసే అవకాశం లేకపోలేదన్నాడు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లో భద్రత లేకుండా ఒంటరిగా జైలులో ఉంచొద్దని, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఎప్పటికీ ఉండాల్సిందేనని తెలిపాడు. -
గోడలతో మాట్లాడుతున్న బాబా!
రోహతక్: మందీమార్బలం, భారీ భద్రత, విలాసవంతమైన సౌకర్యాలతో భోగాలు వెళ్లబోసిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ ఇప్పుడు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో గుర్మీత్‌ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి, 20 ఏళ్ల శిక్ష విధించడంతో ఆయనను రోహతక్‌లోని సునైరా జైల్లో పెట్టారు. సిర్సాలో 700 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించిన డేరా ప్రధాన కార్యలయంలో విలాసవంతమైన జీవితం గడిపిన బాబా ఇప్పుడు ఇరుకైన జైలు గదిలో సాధారణ ఖైదీగా మారారు. తన చుట్టూ మందీ మార్బలంతో హడావుడిగా కనిపించే గుర్మీత్ కారాగారంలో ఒంటరిగా ఉంటున్నారు. జైలు గోడలతో మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పూలపాన్పుపై పవళించిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ ఇప్పుడు జైలులో కఠిన నేలపై నిద్రిస్తున్నారు. జైలు క్యాంటీన్ నుంచి మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతున్నారు. తినడానికి ఆయనకు జైలు ఆహారంతో పాటు ఒక పండు ఇస్తున్నారు. ఆయనకు తోటమాలి పని అప్పగించనున్నారు. జైలు నిబంధనలకు ప్రకారం తోటమాలికి రోజుకు రూ.40 కూలి ఇస్తారు. కాగా, జైలు అధికారులకు గుర్మీత్ ఇచ్చిన రెగ్యులర్ సందర్శకుల జాబితాలో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పేరు కూడా ఉండడం గమనార్హం. -
స్పెషల్ సెల్, మినరల్ వాటర్, అసిస్టెంట్
సాక్షి, రోహతక్: అత్యాచార కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం రోహతక్ సునారియా జైల్లో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాగేందుకు మినరల్ వాటర్‌తో పాటు, ఓ సహాయకుడు సేవలు అందించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జైల్లో గుర్మీత్‌కు సకల మర్యాదలు అందనున్నట్లు వార్తలొచ్చాయి. అధికారులు ఆయనను ఓ ప్రత్యేక సెల్లో ఉంచిన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మిత్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల నేపథ్యంలో ఆయనను తీర్పు అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో రోహతక్ తరలించారు. అనంతరం గుర్మిత్‌ను ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంచి, శుక్రవారం సాయంత్రం జైలుకు తరలించారు. కాగా కోర్టు ప్రాంగణంలో గుర్మీత్‌తో పాటు పలు బ్యాగులు, లగేజీ ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించాయి. ఆ వార్తల్లో నిజం లేదు: జైళ్ల డీజీ అయితే జైలులో గుర్మిత్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు వస్తున్న వార్తలను హరియాణా జైళ్ల డీజీ కేపీ సింగ్ తోసిపుచ్చారు. ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కొన్ని టీవీ చానల్స్, పేపర్లు పేర్కొన్నాయని, అదంతా అవాస్తవమన్నారు. కేసు తీర్పు అనంతరం గుర్మిత్‌ను సునారియా జైలుకు తరలించామే కానీ, గెస్ట్‌హౌస్‌కు కాదన్నారు. అలాగే ఆయనకు జైల్లో సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. గుర్మిత్‌కు సహాయకుడి కానీ, జైలు సెల్లో ఏసీ సదుపాయం కూడా లేదని జైళ్ల డీజీ స్పష్టం చేశారు. సిర్సాలో భయానక పరిస్థితులు కాగా హరియాణాలోని సిర్సాలో భయానక పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. తీర్పు అనంతరం చెలరేగిన హింస ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై ఎటు చూసినా తగలబడిన వాహనాలు, ధ్వంసమైన షాపులు ఇళ్లు, కత్తులు, రాడ్లు, కర్రలు కన్పిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన అందరిలోనూ నెలకొంది. గుర్మీత్ ఆందోళనకారుల దాడులు నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. మరోవైపు గుర్మిత్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.