గోడలతో మాట్లాడుతున్న బాబా!
రోహతక్: మందీమార్బలం, భారీ భద్రత, విలాసవంతమైన సౌకర్యాలతో భోగాలు వెళ్లబోసిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ ఇప్పుడు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో గుర్మీత్‌ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి, 20 ఏళ్ల శిక్ష విధించడంతో ఆయనను రోహతక్‌లోని సునైరా జైల్లో పెట్టారు.
సిర్సాలో 700 ఎకరాల సువిశాల ప్రాంగణంలో విస్తరించిన డేరా ప్రధాన కార్యలయంలో విలాసవంతమైన జీవితం గడిపిన బాబా ఇప్పుడు ఇరుకైన జైలు గదిలో సాధారణ ఖైదీగా మారారు. తన చుట్టూ మందీ మార్బలంతో హడావుడిగా కనిపించే గుర్మీత్ కారాగారంలో ఒంటరిగా ఉంటున్నారు. జైలు గోడలతో మాట్లాడుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పూలపాన్పుపై పవళించిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ ఇప్పుడు జైలులో కఠిన నేలపై నిద్రిస్తున్నారు.
జైలు క్యాంటీన్ నుంచి మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతున్నారు. తినడానికి ఆయనకు జైలు ఆహారంతో పాటు ఒక పండు ఇస్తున్నారు. ఆయనకు తోటమాలి పని అప్పగించనున్నారు. జైలు నిబంధనలకు ప్రకారం తోటమాలికి రోజుకు రూ.40 కూలి ఇస్తారు. కాగా, జైలు అధికారులకు గుర్మీత్ ఇచ్చిన రెగ్యులర్ సందర్శకుల జాబితాలో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పేరు కూడా ఉండడం గమనార్హం.