స్పెషల్ సెల్, మినరల్ వాటర్, అసిస్టెంట్
సాక్షి, రోహతక్: అత్యాచార కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం రోహతక్ సునారియా జైల్లో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాగేందుకు మినరల్ వాటర్‌తో పాటు, ఓ సహాయకుడు సేవలు అందించేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జైల్లో గుర్మీత్‌కు సకల మర్యాదలు అందనున్నట్లు వార్తలొచ్చాయి. అధికారులు ఆయనను ఓ ప్రత్యేక సెల్‌లో ఉంచిన్నట్టు తెలుస్తోంది.
ఇద్దరు మహిళా సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మిత్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల నేపథ్యంలో ఆయనను తీర్పు అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో రోహతక్ తరలించారు. అనంతరం గుర్మిత్‌ను ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంచి, శుక్రవారం సాయంత్రం జైలుకు తరలించారు. కాగా కోర్టు ప్రాంగణంలో గుర్మీత్‌తో పాటు పలు బ్యాగులు, లగేజీ ఉన్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించాయి.
ఆ వార్తల్లో నిజం లేదు: జైళ్ల డీజీ
అయితే జైలులో గుర్మిత్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు వస్తున్న వార్తలను హరియాణా జైళ్ల డీజీ కేపీ సింగ్ తోసిపుచ్చారు. ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు కొన్ని టీవీ చానల్స్, పేపర్లు పేర్కొన్నాయని, అదంతా అవాస్తవమన్నారు. కేసు తీర్పు అనంతరం గుర్మిత్‌ను సునారియా జైలుకు తరలించామే కానీ, గెస్ట్‌హౌస్‌కు కాదన్నారు. అలాగే ఆయనకు జైల్లో సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు. గుర్మిత్‌కు సహాయకుడి కానీ, జైలు సెల్‌లో ఏసీ సదుపాయం కూడా లేదని జైళ్ల డీజీ స్పష్టం చేశారు.
సిర్సాలో భయానక పరిస్థితులు
కాగా హరియాణాలోని సిర్సాలో భయానక పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. తీర్పు అనంతరం చెలరేగిన హింస ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై ఎటు చూసినా తగలబడిన వాహనాలు, ధ్వంసమైన షాపులు ఇళ్లు, కత్తులు, రాడ్లు, కర్రలు కన్పిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన అందరిలోనూ నెలకొంది. గుర్మీత్ ఆందోళనకారుల దాడులు నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. మరోవైపు గుర్మిత్ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.