బాబా రామ్‌దేవ్‌కు స్వేచ్ఛ
లండన్: దాదాపు రెండు రోజులుగా విచారణ పేరుతో తమ నిర్బంధంలో ఉంచిన యోగా గురు రామ్‌దేవ్‌ను బ్రిటన్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు శనివారం విడుదల చేశారు. యోగా శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం లండన్ చేరుకున్న ఆయనను కస్టమ్స్ అధికారులు హీత్రూ విమానాశ్రయంలో నిలిపేశారు. నిర్బంధానికి తగిన కారణాలేమీ చెప్పకుండానే ఆయనను మొదటిరోజు ఆరుగంటలపైనే విచారించారు. బిజినెస్ వీసాపై గాకుండా సందర్శకుల వీసాపై ప్రయాణించడంపైనే అధికారులు ఆయనను ప్రశ్నించారని సమాచారం.
శనివారం సాయంత్రం భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్‌తో కలిసి హీత్రూ విమానాశ్రయానికి వచ్చిన రామ్‌దేవ్, చీఫ్ ఇమిగ్రేషన్ అధికారిని కలిశారు. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం అధికారులు ఆయన స్వేచ్ఛగా బ్రిటన్‌లో తన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని స్పష్టంచేశారు. అధికారుల ప్రకటన తర్వాత రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ, తన నిర్బంధం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ హస్తం ఉండవచ్చని అన్నారు.
అంతకు ముందు ఈ విషయంపై స్పందించడానికి బ్రిటన్ హోం శాఖ నిరాకరించింది. బ్రిటన్‌లో యోగా శిబిరాల నిర్వహణతో పాటు పతంజలి యోగాపీఠ్ (బ్రిటన్) ట్రస్టు కార్యక్రమాల్లో రామ్‌దేవ్ ప్రసంగించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం లండన్‌లోని లాంప్టాన్ పార్కులో ప్రవాసభారతీయుల సదస్సులో రామ్‌దేవ్ కీలక ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో నిర్బంధం విషయం కొలిక్కి వచ్చేవరకు ఆ కార్యక్రమం నిలిపేశారు. రామ్‌దేవ్ నిర్బంధం తీవ్రమైన విషయమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కోరారు.