
భారత క్రికెటర్ రవీంద్ర జడేజా(పాత చిత్రం)
జామ్‌నగర్(గుజరాత్): భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్‌సిన్హ్, సోదరి నైనాబా తాజాగా పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల రోజుల క్రితమే జడేజా భార్య రివాబా కాషాయ పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. కుటుంబంలో తలా ఒకరు ఒక్కొక్క పార్టీలో చేరడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. జామ్‌నగర్ జిల్లాలోని కలవాడ్ నగరంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో జడేజా తండ్రి, సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడేజా సొంతూరు జామ్‌నగర్ కాగా.. ఆ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున ములు కండోరియా పోటీ చేస్తున్నారు.
గత నెల 3న జడేజా భార్య రివాబా, జామ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ పూనమ్‌బెన్ మాడమ్ సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం జామ్‌నగర్ స్థానం నుంచి పూనమ్‌బెన్‌కే బీజేపీ టిక్కెట్ కేటాయించింది. నిజానికి జామ్‌నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్డిక్ పటేల్ పోటీ చేయాల్సింది. కానీ గతంలో ఆయనకు ఓ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ కూడా నిరాశే ఎదురైంది. 26 లోక్‌సభ స్థానాలున్న గుజరాత్‌లో మూడో దశ ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment