విచారణకే కాదు, ఉరిశిక్షకైనా సిద్ధం
విచారణకే కాదు, ఉరిశిక్షకైనా సిద్ధం
Published Wed, Apr 19 2017 2:14 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
► ఈరోజు అయోధ్య వెళ్తా.. రామ మందిరాన్ని కట్టాల్సిందే
► నన్ను రాజీనామా చేయాలనే హక్కు కాంగ్రెస్‌కు లేదు
► అవును... నేను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నా
► కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందన
న్యూఢిల్లీ
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకే కాదు.. అవసరమైతే ఉరి తీయించుకోడానికైనా తాను సిద్ధమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. విచారణ రెండు గంటలు గడిచినా, రెండు సంవత్సరాలు గడిచినా దాన్ని తాను ఎదుర్కొంటానన్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిరాన్ని నిర్మించాలనే తాను చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తనను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె చెప్పారు. తిరంగా వివాదం సమయంలో తన మీద ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టే తాను అప్పట్లో రాజీనామా చేశానన్నారు. తాను ఈరోజు అయోధ్య వెళ్తానని, కాంగ్రెస్ ఆరోపణల మీద, తాను రాజీనామా చేయాలన్న వాళ్ల డిమాండు మీద మాత్రం స్పందించబోనని తెలిపారు. అసలు ఏ విషయమైనా చెప్పడానికి వాళ్లెవరని ఆమె ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ విధించింది వాళ్లు, బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది వాళ్లు, 1984 మత ఘర్షణలకు కారణమైంది వాళ్లేనని ఉమాభారతి మండిపడ్డారు. రామ మందిరాన్ని తాము కట్టాలన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని, రామ మందిరం అంశం వల్లే తాము అధికారంలోకి వచ్చామని ఆమె చెప్పారు. ఎలాంటి తీర్పునైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి కుట్ర లేదని, అంతా బహిరంగంగానే ఉందని అన్నారు. తన ఉద్దేశం, చర్యలు అన్నీ ఒకటేనని, తాను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నానని కూడా ఉమాభారతి చెప్పారు.
Advertisement