
'ములాయంను వారిద్దరు తప్పుదోవపట్టించారు'
ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాది పార్టీలో మాటల వేడి రోజుకింత పెరుగుతోంది. సొంతపార్టీలోని వ్యక్తులు ఇప్పటికే చీలిపోయి సొంత అజెండాలతో ముందుకెళుతూ మాటలయుద్ధం చేస్తున్నారు.
లక్నో: ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాది పార్టీలో మాటల వేడి రోజుకింత పెరుగుతోంది. సొంతపార్టీలోని వ్యక్తులు ఇప్పటికే చీలిపోయి సొంత అజెండాలతో ముందుకెళుతూ మాటలయుద్ధం చేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ గుర్తుపై రేపు ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని వెల్లడించనుండగా సీఎం అఖిలేశ్ యాదవ్ వర్గంలోని కీలక నేత రామ్‌గోపాల్ యాదవ్ ఆదివారం మరోసారి స్పందించారు. నిజమైన సమాజ్ వాది పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా అఫిడవిట్లు సమర్పించామని, ఈసీకి సమర్పించిన వాటినే ములాయంకు కూడా పంపించామని, కానీ ఆయనకు అవి చేరలేదని అన్నారు.
గత రెండేళ్లుగా ములాయంను స్వేచ్ఛగా ఆలోచించుకోనివ్వకుండా చేస్తున్నవారే (శివపాల్‌యాదవ్, అమర్‌సింగ్‌ను ఉద్దేశించి) ఇప్పుడు ఆయనకు తప్పేడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. తాము ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో ఫోర్జరీ చేసిన సంతకాలు ఉన్నాయని అమర్ సింగ్ అనడం, వాటిని సమర్దిస్తూ ములాయం కూడా ఆ సంతకాలను ఈసీ తనిఖీ చేయాలని కోరడం శోచనీయమన్నారు. నిజానికి తప్పుడు పనులు చేసేవారు మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తారని, మాకు అలాంటి అలవాట్లు లేదంటూ మండిపడ్డారు.