హాట్ కేకుల్లా టిక్కెట్ల అమ్మకాలు
రైల్వే టిక్కెట్లు ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే రికార్డు స్థాయిలో రైల్వే టిక్కెట్లు బుక్ అయ్యాయి. కాగా 120 రోజుల ముందే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్న నిబంధన అమల్లోకి వచ్చిన మొదటిరోజే 13.45 లక్షల టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. సాధారణంగా అయితే రోజుకు 5లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యేవి. తాజాగా నాలుగు నెలల ముందే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే నియామవళిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇది ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చింది.
గతంలో 60రోజుల ముందు మాత్రమే ఆన్లైన్ టికెట్ల విక్రయానికి అవకాశం ఉండేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు 120 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నిబంధనను కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇక పగటి పూట నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు తాజ్ ఎక్స్ప్రెస్, గోమతి ఎక్స్ప్రెస్, కొన్ని ఇతరత్రా సర్వీసులకు 30 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఒకసారి వెబ్సైట్లో లాగిన్ అయితే కేవలం ఒక టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని, ఆ తర్వాతే మరోసారి లాగిన్ అయితే మరో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉందిని రైల్వే శాఖ తెలిపింది.