అఫ్జల్‌ గురు ‘ఉరి’రోజు ఏం జరిగింది? | Recounting Afzal Guru Last Moments in Tihar Jail | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌ గురు ‘ఉరి’రోజు ఏం జరిగింది?

Published Tue, Nov 19 2019 12:10 PM | Last Updated on Tue, Nov 19 2019 4:09 PM

Recounting Afzal Guru Last Moments in Tihar Jail - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మిమ్మల్ని ఈ రోజే ఉరి తీస్తున్నామని చెప్పడానికి విచారిస్తున్నాను’ అని తీహార్‌ జైలు సూపరిండెండెంట్‌ ఆ రోజు అఫ్జల్‌ గురకు చెప్పారు.
‘నాకు తెలుసు, నేనూహించినదే జరుగుతోంది. అప్నే లియేతో క్యా జియే, తూ జీ ఏ దిల్‌ జమానే కేలియే (మన కోసం మనం జీవిస్తే అందులో అర్థమేముంది, ఇతరుల కోసం జీవించాలి)’ అనే బాదల్‌ చిత్రంలోని పాటను ఆయన మెల్లగా పాడుతూ కాస్త టీ ఇమ్మని అడిగారు. అప్పటికే టీ బాయ్‌ వెళ్లిపోయాడు. అతని ఆఖరి కోరికను కూడా తీర్చలేక పోయామని జైలు అధికారి బాధ పడ్డారు. ‘మీరు అనుకుంటున్నట్లు నేను టెర్రరిస్టును కాను. వాంటెడ్‌ పర్సన్‌ను కూడా కాదు. నేను అవినీతి వ్యతిరేకిని. రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చాను.

‘బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మీ ఉరి వార్త తెలిస్తే అల్లర్లు చెలరేగ వచ్చు. అల్లర్లు జరగకుండా మీ అనుచరులకు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?’ తీహార్‌ జైలు అధికారి అఫ్జల్‌ గురును కోరారు. ‘మీ కళ్లలో నా పట్ల సానుభూతి కనిపిస్తోంది. ఉరికంబం వరకు మీరు నా వెంట వస్తారుగా!’ అని ఆయన అడిగారు. అందుకు అవును అన్నట్లు ఆ జైలు అధికారి తలూపారు. ‘కాస్త నొప్పి లేకుండా చూడండి’ అని అఫ్జల్‌ గురు కోరారు. ఆ తర్వాత ఇద్దరు మౌనంగా ఉరికంబం వరకు వెళ్లారు. అక్కడ అఫ్జల్‌ గురును ఉరితీసేందుకు తలారీ సిద్ధంగా ఉన్నారు. అక్కడున్న వారంతా ఉరి అమలు చేయడం ప్రశాంతంగా జరిగి పోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇసుక బ్యాగులతో నిర్వహించిన రెండు ట్రయల్స్‌ విఫలమయ్యాయి. ఉరి తీయాల్సిన వ్యక్తి బరువెంతో తెలుసుకుని అంతె బరువుగల ఇసుక బ్యాగ్‌తో ఉరితీసే ప్రక్రియకు ట్రయల్స్‌ వేస్తారు.

మొదటి ట్రయల్‌ మూడు రోజుల ముందు జరిగింది. మొదటి ట్రయల్స్‌లోనే ఉరి తాడు తెగిపోయింది. ఉరి తాళ్లను ‘మనీలా రోప్స్‌’గా వ్యవహరిస్తారు. వాటిని బీహార్‌లోని బక్సర్‌ జైలు నుంచి తెప్పిస్తారు. అఫ్టల్‌ గురుకు ఉరి శిక్ష ఖరారైన 2005లోనే ఆ తాడును తెప్పించడంతో అది చీకిపోయి తెగిపోయింది. మళ్లీ వెంటనే బక్సర్‌ జైలుకు ఆర్డర్‌ ఇవ్వడంతో వారు రెండు రోజుల్లో ఉరి తాడును పేనించి 860 రూపాయలకు సరఫరా చేశారు. ఆ తాడుతో కూడా ఒక ట్రయల్‌ విఫలమైంది. రెండో ట్రయల్‌ సక్సెస్‌ అయింది.

అనుమతి కోసం తలారి జైలు అధికారి వైపు చూస్తున్నారు. ఆయన తలూపగానే తలారి తన పని ముగించారు. రెండు గంటల అనంతరం వైద్యులు వచ్చి అఫ్జల్‌ గురు మరణించినట్లు ధ్రువీకరించారు. 30 ఏళ్ల క్రితం కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు, నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ వ్యవస్థాపకుడు మఖ్బూల్‌ భట్‌ను సమాధి చేసిన చోటనే ముస్లిం సంప్రదాయం ప్రకారం అఫ్టల్‌ గురు భౌతిక కాయాన్ని ఖననం చేశారు. 2013, ఫిబ్రవరి 9వ తేదీన ఆయన్ని ఉరితీయగా, పదవ తేదీన ఆయన కుటుంబ సభ్యులకు పోస్టల్‌ ద్వారా సమాచారాన్ని అందించారు. అది 11వ తేదీన వారికి చేరింది.

అఫ్జల్‌ గురు తీహార్‌ జైల్లో ఉన్న ఐదేళ్లపాటు రోజు ఐదుసార్లకు తగ్గకుండా ప్రార్థనలు చేయడంతోపాటు మిగతా సమయాల్లో ఎప్పుడూ గీతా, ఖురాన్, వేదాలు చదువుతూ కనిపించేవాడని జైలు అధికారులు తెలిపారు. జైలు అధికారులు సునీల్‌ గుప్తా, సునేత్ర చౌదరి ‘బ్లాక్‌ వారంట్‌’ పేరిట ప్రచురించిన పుస్తకంలోని అంశాలు ఇవి. వారం రోజుల క్రితమే మార్కెట్‌లోకి వచ్చిన ఈ పుస్తకం ‘అమెజాన్‌ ఆన్‌లైన్‌’లో 299 రూపాయలకు అందుబాటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement