రీగల్‌లో ఆఖరి షో..హౌస్‌ఫుల్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత రీగల్ థియేటర్ ఆఖరి షోకు సిద్ధమవుతోంది. రాజ్‌కపూర్ బ్లాక్ బస్టర్ సినిమాలు సగం, 1964 నాటి మేరానామ్ జోకర్ సినిమాల ప్రదర్శనతో చరిత్రలో నిలిచిపోనుంది. దాదాపు 80 ఏళ్ల థియేటర్ ప్రస్థానం హౌస్‌ఫుల్‌తో ఆగిపోనుంది. కపూర్ కుటుంబానికి చెందిన సినిమా, నాటకరంగాలకు వేదిక అది.
మహామహులు చూసేది ఇక్కడే: 1932వ సంవత్సరంలో బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైన ఈ థియేటర్‌లో ప్రప్రథమ ప్రధానమంత్రి జవాహర్‌లాల్‌నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీతోపాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లాంటి మహామహులు సినిమాలు చూశారు. అలనాటి చలనచిత్ర వైభవాన్ని చాటే చిత్రాలు, నర్గీస్, మధుబాల, దేవానంద్, రాజ్‌కపూర్ తదితర మహానటుల పోస్టర్లు ఇప్పటికీ రీగల్ కారిడార్లలో కనిపిస్తుంటాయి. థియేటర్ సిబ్బంది అంతా చివరి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నారని థియేటర్ అకౌంటెంట్ అమర్‌సింగ్ వర్మ తెలిపారు. శుక్రవారం నాలుగు షోలు ముగిసిన తర్వాత సిబ్బందితో సహపంక్తి విందు ఏర్పాటు చేశామని చెప్పారు. చివరి ప్రదర్శన అయినప్పటికీ టికెట్ల ధరలను మాత్రం పెంచలేదని అన్నారు. ఇదివరకటి మాదిరిగానే రూ.80, రూ.100, రూ.120, రూ.200 గానే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయని తెలిపారు. ప్రస్తుతం థియేటర్ కోసం పనిచేస్తున్న 15 సిబ్బంది భవితవ్యంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
మల్టీప్లెక్స్ నిర్మాణం: అయితే, థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచన యాజమాన్యానికి ఉందని, అది కార్యరూపం దాలిస్తే వీరందరికీ అందులో ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆయన నాలుగు దశాబ్దాలుగా ఈ థియేటర్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. బాబీ సినిమా మొదటి షోకు రీగల్‌నే వేదిక. గుడ్‌బైటు రీగల్.. డిమోలిష్. అడియోస్ రీగల్ థియేటర్ అంటూ సినియర్ నటుడు రిషి కపూర్ ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు.