ప్రాంతీయపార్టీల హవా పెరుగుతోంది: దేవేగౌడ
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతోందని, దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏర్పడే మార్పులకు ఇది కీలకం అవుతుందని భావిస్తున్నానని మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు, కర్నాటక రాష్ర్టం హాసన్ లోక్‌సభ సభ్యుడు హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరిపై సతీసమేతంగా ఆయన సోమవారం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు.
బీజేపీ పాలనలో ప్రజల్లో ఎన్నడూ లేనివిధంగా అసహనం పెరుగుతోందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను దళితులపై జరిగిన దాడులపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ఆవు చర్మాలు ఒలిచినా కూడా దాడులు చేస్తూండడంపై విచారం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికల్లో దళితులపై దాడులు ప్రధానాంశం అవుతుందని ఆయనన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యత లు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన సంఘటనలతో కశ్మీర్ సమస్య మరింత జటిలమైందని దేవెగౌడ అన్నారు. దీనిని బీజేపీ ఏవిధంగా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ వైఖరిపై దాని మిత్రపక్షాలైన టీడీపీ, శివసేన కూడా గుర్రుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో థర్‌డఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు.
బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీకి దాదాపు మూడేళ్ల పదవీ కాలం ఉందని గుర్తు చేశారు. అది పూర్తయ్యాక కానీ థర్‌డఫ్రంట్‌పై స్పష్టత రాదని అన్నారు. కర్నాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని దేవెగౌడ తెలిపారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ సొంతంగా పోటీ చేసి గెలుస్తుందని, తన కుమారుడు కుమారస్వామి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. గతంలో 20 నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని చేసినపుడు అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఆ తరువాత ఏ ముఖ్యమంత్రీ కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదని తెలిపారు. అందువల్లనే ప్రజలు కుమారస్వామి పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.