మతతత్వ బీజేపీని పారదోలాలి!
పశ్చిమబెంగాల్‌లో అవినీతి టీఎంసీని గద్దె దించాలి
♦ దూరమైనవారిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలి
♦ పశ్చిమబెంగాల్‌లో ప్రారంభమైన సీపీఎం ప్లీనం
కోల్‌కతా: కేంద్రంలో మతతత్వ బీజేపీని, పశ్చిమబెంగాల్‌లో అవినీతి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని సీపీఎం పిలుపునిచ్చింది. సీపీఎం ప్లీనం ఆదివారం కోల్‌కతాలో ఘనంగా ప్రారంభమైంది. పార్టీ పొలిట్‌బ్యూరొ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు సహా దేశం నలుమూలల నుంచి వచ్చిన 400కు పైగా నేతలు 5 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 37 ఏళ్ల విరామం అనంతరం సీపీఎం ప్లీనం నిర్వహిస్తోంది. గతంలో చివరగా 1978లో పశ్చిమబెంగాల్‌లో సీపీఎం ప్లీనం జరిగింది. తాజా ప్లీనంలో పార్టీ పునరుజ్జీవనానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు.
ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కూడగట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పలువురు నేతలు నొక్కి చెప్పారు. అలాగే, పార్టీకి దూరమైన కార్మిక, కర్షక, నిరుపేద వర్గాలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. ‘బీజేపీ దేశం మొత్తం మతతత్వ విషం చిమ్ముతోంది. టీఎంసీ పశ్చిమబెంగాల్‌ను నాశనం చేస్తోంది. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తృణమూల్‌ను గద్దె దించాల్సిందిగా పిలుపునిస్తున్నాం’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ తాజాగా చేసిన పాక్ పర్యటనను ఎద్దేవా చేస్తూ.. ‘నాయకుల మధ్య పైపై చర్చలు భారత్-పాక్ సంబంధాలను మెరుగుపర్చవ’ని తేల్చిచెప్పారు. ‘ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఆపే వరకు పాక్‌తో చర్చలుండవన్నారు. ఇప్పుడు మళ్లీ చర్చలంటున్నారు.
మరోవైపు, మీరు పాక్ ఘజల్ గాయకుడిని ముంబైలో పాడనివ్వరు. పాక్ క్రికెట్ టీం భారత్‌లో పర్యటించవద్దంటారు’ అని వ్యాఖ్యానించారు. పాక్‌తో చర్చలు అవసరమే. వాటిని మేం స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ శక్తులకు బెంగాల్‌లో అంగుళం కూడా వదలబోం’ అని పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ పేర్కొన్నారు. ‘అసహనంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంటే టీఎంసీ ఎంపీలు ఎక్కడా కనిపించరు. బహుశా శారద చిట్‌ఫండ్ స్కామ్‌లో జైళ్లోనో, బెయిల్‌పైననో వారంతా ఉండి ఉంటారు’ అంటూ ఎద్దేవా చేశారు. ‘బెంగాల్‌లో పరిస్థితి దారుణంగా.. కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో అవినీతిపరులు, నేరస్తుల ప్రభుత్వం ఉంది.
పారిశ్రామికీకరణ నిస్తేజంగా ఉంది’ అంటూ పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య.. మమత బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అవినీతిమయమైన ఈ ప్రభుత్వాన్ని తొలగించి, రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉందన్నారు. ఇందుకు గట్టి పోరాటమే చేయాల్సి ఉందన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2011లో అధికారం కోల్పోయిన తరువాత పశ్చిమబెంగాల్‌లో సీపీఎం బాగా బలహీనపడిన నేపథ్యంలో.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ ప్లీనంలో చర్చించనున్నారు. ‘పార్టీకి దూరమైన వర్గాలను మళ్లీ కలుపుకోవాలి.
అందుకు ప్రతీ కార్యకర్త రోజుకు ఒక్కరైనా కొత్త వ్యక్తిని కలవాలి. బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్‌ల్లోని అణగారిన వర్గాలకు చెందిన కార్యకర్తలకు కూడా దగ్గరవ్వాలి. దీన్నో సవాలుగా తీసుకోవాలి’ అని పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, పొలిట్‌బ్యూరొ సభ్యుడు సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. సీపీఎంలో నెలకొన్న విభేదాలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘కొంతమంది పార్టీని వీడితేనే మంచిది’ అని అన్నారు. ‘వారు కొద్దిమందే.. వారు బయటికెళ్తేనే మంచింది. పార్టీలో ఉండాల్సిన చాలామంది.. పార్టీకి వెలుపలు ఉన్నారు. వారిని పార్టీలోకి తీసుకురావాలి’ అన్నారు. అయితే, ఆయన ఎవరి పేరునూ ప్రత్యేకంగా పేర్కొనలేదు.
స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాలున్న వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు మార్కిస్ట్ నేతలు అభిప్రాయపడ్డారు. బలమైన వామపక్ష ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో బెంగాల్ కీలక భూమిక పోషించాలని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష శక్తులు బలోపేతం కావాల్సి ఉందన్నారు.