'మెజారిటీ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించాలి'
న్యూఢిల్లీ: రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు గొడ్డుమాంసం వినియోగంపై నిషేధం విధించడాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా సమర్ధించారు. ఆవులపై ప్రత్యేక పూజ్యభావం కలిగిన మెజారిటీ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిందేనన్నారు. ‘ఎవరి సెంటిమెంట్లనూ గాయపర్చకూడదన్నది నా విధానం. మైనారిటీల సెంటిమెంట్ల గురించి మాట్లాడే మీరు.. మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు?’ అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. దేశ రాజధానిలో సోమవారం వక్ఫ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
ఒక ఆహార పదార్ధం తినడం ఇతరుల భావోద్వేగాలను గాయపరుస్తుందనుకున్నప్పుడు.. దాన్ని తినకపోవడమే మంచిదన్నారు. ‘మన పొరుగింటివారి సెంటిమెంట్ల గురించి కూడా ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత హర్యానా, మహారాష్ట్రలు ఇటీవల గోవధను, గొడ్డు మాంసం వినియోగాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.