
శ్రీనగర్‌లో భద్రతా బలగాల పహారా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. జమ్మూలో ఆంక్షలు పూర్తిగా తొలిగించామని.. కశ్మీర్‌లో మాత్రం కొన్ని రోజులపాటు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని జమ్మూకశ్మీర్ అడిషనల్ డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం పంద్రాగస్టుపై దృష్టిసారించామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ వేడుకలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మునీర్‌ఖాన్ తెలిపారు.
2010, 2016 నాటి వీడియోలను వైరల్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహాయిస్తే.. కశ్మీర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని కేంద్రహోంశాఖ కూడా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన అనంతరం జమ్మూకశ్మీర్‌లో భారీగా బలగాలు మోహరించి.. పలు నిషేధాజ్ఞలు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జమ్మూలో క్రమంగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. కశ్మీర్‌లోనే ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి.