‘‘ఇక్కడే ఉంటే నేను భయంతోనే చచ్చిపోయేలా ఉన్నాను. నా చుట్టూ అన్నీ శవాలే. దయచేసి నన్ను ఇంటికి తీసుకువెళ్లండి’’ అంటూ సురేందర్ కుమార్ అనే కరోనా పేషెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డీఎమ్సీ) రిటైర్టు అధికారి అయిన సురేందర్‌కు జూన్ 8న నిర్వహించిన కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్(ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్లగా.. అక్కడ అన్నీ మృతదేహాలే ఉండటంతో సురేందర్ కుమార్ బెంబేలెత్తిపోయారు. తనకు భయంగా ఉందని, వెంటనే ఇంటికి తీసుకువెళ్లి అక్కడే చికిత్స అందించాలంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆస్పత్రిలోని పరిస్థితిని వివరించారు. అనేక పరిణామాల అనంతరం ఎట్టకేలకు ఇంటికి చేరుకుని.. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చేరే ఏర్పాట్లలో ఉన్నారు. (ఆసుపత్రిలో చేరిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి)
బయటకు తోసేశారు..
ఈ విషయం గురించి సురేందర్ కుమారుడు సందీప్ లాలా కుమార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాన్నను ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో ఆక్సిజన్ పెట్టడానికి ఓ వార్డు బాయ్ వచ్చాడు. అతడు ముక్కుకు కాకుండా, తలకు మాస్కు పెట్టుకున్నాడు. ఇదంతా ఏంటని నిలదీశాం. దీంతో బౌన్సర్లు వచ్చి మమ్మల్ని బయటకు తోసేశారు. మా నాన్న కోసం తీసుకువెళ్లిన భోజనం, ఫోన్లు ఉన్న బ్యాగ్‌ను ఇచ్చేందుకు కూడా వారు అనుమతించలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా తన తండ్రికి సంబంధించి ఆస్పత్రి నుంచి ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. హెల్‌్పలైన్ నంబరుకు ఫోన్ చేస్తే బిజీ వచ్చిందని.. చేసేదేం లేక ఓ స్వీపర్‌కు కొన్ని డబ్బులు ఇస్తే అతడు సురేందర్ కుమార్‌కు తాము పంపిన ఫోన్ అందించాడని తెలిపారు. తాను ఎన్నోసార్లు తండ్రికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ లేదని.. అసలేం జరిగిందో చెప్పలేదని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.(కరోనా: పది రోజుల్లో 5 లక్షల కేసులు!)
ఆస్పత్రి నుంచి పారిపోయారని చెప్పారు
ఈ క్రమంలో జూన్ 11న సురేందర్ కుమార్ ఆస్పత్రి నుంచి పారిపోయారని తనకు ఫోన్ వచ్చిందని.. దీంతో తాను మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చానని పేర్కొన్నారు. సోదరుడితో కలిసి తాను ఆస్పత్రికి పరిగెత్తుకు వెళ్లానని పీపీఈ కిట్ ధరించి ఆస్పత్రి అంతా వెదకగా.. తండ్రి ఓ మూలన కనిపించాడని, వెంటనే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి.. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచేలా అనుమతి తీసుకున్నామన్నారు. దీంతో ఎట్టకేలకు సురేందర్ ఇంటికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఇక తనకు ఎదురైన అనుభవం గురించి సురేందర్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అక్కడ ఏర్పాట్లేవీ సరిగా లేవు. నాకు బ్రెడ్డు ముక్కలు పెట్టారు. నీళ్లు లేవు. ఇంకో రెండు రోజులు అక్కడే ఉంటే చనిపోయేవాడిని. ఎక్కడ చూసినా మృతదేహాలే’’ అని చెప్పుకొచ్చారు.(కరోనా: ఆ 6 రాష్ట్రాలకు రాజస్తాన్ ఆఫర్!)
కాగా సురేందర్ కుమార్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయనను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధానిలో ఢిల్లీలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ కోవిడ్ పేషెంట్ల చికిత్స కోసం చేసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment