అవినీతి ప్రక్షాళనే లక్ష్యం!
ఉద్యోగ, ఉపాధి కల్పన తదుపరి లక్ష్యాలు
- ప్రధాని మోదీ ఉద్ఘాటన
న్యూఢిల్లీ: నల్లధనం, అవినీతి నుంచి వ్యవస్థను ప్రక్షాళన చేయడం ప్రస్తుతం తన ఎజెండాలో ఉన్న అత్యంత ప్రాధాన్య అంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధి అవకాశాల రూపకల్పన కూడా తన ప్రధాన ఎజెండాలో ఉన్నాయన్నారు. 21వ శతాబ్ది ఆసియా దేశాలదేనని తేల్చిచెప్పారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆసియా దేశాలు మాత్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని చూపాయని గుర్తు చేశారు. ‘ఎకనమిక్ టైమ్స్ ఆసియన్ బిజినెస్ లీడర్స్ కాంక్లేవ్’లో బుధవారం మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో కలిసి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రెండున్నరేళ్ల ఎన్డీయే పాలనలో తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు, పథకాలను వివరించారు. ‘భారత్‌లో ప్రస్తుతం ఆర్థిక పరిణామ దశ కొనసాగుతోంది. డిజిటల్, నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తున్నాం. ఉద్యోగ, ఉపాధి కల్పన సాధించేందుకు అవసరమైన ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటోంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరగడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాం’ అని మోదీ వివరించారు. పరోక్ష పన్ను వ్యవస్థలో మార్పులకు ఉద్దేశించిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పార్లమెంటు ఆమోదం పొందిందని, 2017లో అమల్లోకి వస్తుందని తెలిపారు.‘భారత్ పెట్టుబడులకు మంచి గమ్యమే కాదు.. భారత్‌లో ఉండాలనుకోవడం మంచి నిర్ణయం కూడా అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులకు ఇబ్బందులు తొలగించే దిశగా అనేక విభాగాల్లో సింగిల్ విండో పథకాన్ని చేపట్టామన్నారు. పెట్టుబడుల విషయంలో తాము తీసుకున్న సానుకూల నిర్ణయాలు దేశీయంగా, విదేశాల్లో మంచి గుర్తింపును పొందాయని, అందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న రేటింగ్‌లే నిదర్శనమని పేర్కొన్నారు.
తమ రెండున్నరేళ్ల పాలనలో 13 వేల కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం 6వ అతిపెద్ద తయారీ కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుందన్నారు. ‘విప్లవాత్మక స్థాయిలో భారత్‌లో స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థను నడిపేవి అవే’ అని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు మౌలిక వసతుల కల్పన మనముందున్న ప్రధాన సవాలు. అందుకే దేశవ్యాప్తంగా పారిశ్రామిక కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టాం. రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం’ అని చెప్పారు.