
సాక్షి, హైదరాబాద్ : ఓ రోజు 6 పైసలు.. మరోరోజు 4 పైసలు.. ఇంకోరోజు 24 పైసలు.. చినుకు చినుకు కలసి వరదగా మారినట్టు.. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ ధరల సవరణతో కొంచెం కొంచెంగా పెరుగుతూ సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరాయి. రోజువారీ ధరల సవరణ చేపట్టిన తర్వాత ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్ట స్థాయిలకు చేరాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.78.08కు, డీజిల్ ధర రూ.70.16కు.. విజయవాడలో పెట్రోల్ రూ.79.43కు, డీజిల్ రూ. 71.59కు చేరాయి. తెలుగు రాష్ట్రాలు డీజిల్ ధరలో దేశంలోనే టాప్‌గా నిలవగా.. పెట్రోల్ ధరలో రెండో స్థానంలో ఉండటం గమనార్హం.
రోజురోజుకు పెరుగుతూనే..
చమురు సంస్థలు మొదట్లో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించేవి. అయితే గతేడాది జూన్ 16వ తేదీ నుంచి మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకారోజు ధరల సవరణను అమల్లోకి తెచ్చాయి. ఇందులో తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా.. ఆ తర్వాతి నుంచి మోత మోగిస్తూనే వస్తున్నాయి. మార్కెట్ ధరల సవరణ సమయంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.67.11 కాగా.. మూడు నెలల క్రితం రూ.75.47కు, తాజాగా రూ.78.08కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర గత నెల 23న రూ. 76.56 మాత్రమే. అంటే ఈ పది రోజుల్లోనే రూ.1.52 పెరిగింది. ఇందులో ఆదివారం రోజునే 19 పైసలు పెరిగింది. ఇక మూడు నెలల కింద డీజిల్ ధర రూ.రూ.67.23కాగా.. ఇప్పుడు రూ.70.16కు చేరింది.